
యురి దాడిపై ఫేస్‌బుక్ వ్యాఖ్యలు.. విద్యార్థి బహిష్కరణ
యురి ఉగ్రవాద దాడిమీద ఫేస్‌బుక్ చర్చలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఓ విద్యార్థిని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం బహిష్కరించింది. అతడు జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. అతడు చేసిన వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదు అందిందని అలీగఢ్ సీనియర్ ఎస్పీ రాజేష్ పాండే చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో.. దీనిపై విచారణ జరపాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలను తాము కోరామని ఆయన తెలిపారు.
దీనిపై విచారణ జరిపిన అనంతరం అతడే ఆ వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణ కావడం, అవి అభ్యంతరకరంగా ఉండటంతో అతడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ తెలిపారు. కశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో గల యురి పట్టణంలో ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై చేసిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు అసువులు బాసిన విషయం తెలిసిందే.