
నేటి నుంచి కశ్మీర్‌లో అఖిలపక్షం
వేర్పాటువాదులను చర్చలకు ఆహ్వానించిన మెహబూబా
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆదివారం నుంచి రెండ్రోజులపాటు అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు కేంద్రమంత్రులు అనంత్ కుమార్, జితేంద్ర సింగ్, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి, పలు రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం చర్చలు జరుపనుంది. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ సింగ్ తో పాటుగా కేంద్ర మంత్రులు జైట్లీ, రాం విలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరీ (సీపీఎం), డి.రాజా (సీపీఐ), శరద్ యాదవ్ (జేడీయూ), సౌగత రాయ్ (టీఎంసీ), తారీఖ్ అన్వర్ (ఎన్సీపీ), సంజయ్ రావత్ (శివసేన), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), ప్రేమ్ సింగ్ (అకాలీదళ్), దిలీప్ తిర్కే (బీజేడీ), అహ్మద్ (ముస్లిం లీగ్), తోట నరసింహం (టీడీపీ), ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), పి. వేణుగోపాల్ (ఏఐఏడీఎంకే), ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ), తిరుచి శివ (డీఎంకే) తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కశ్మీర్‌లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల బృందంతో వెళ్లటం లేదు. అయితే కశ్మీర్‌పై కేంద్రం చేప ట్టే చర్యలకు తమ మద్దతుంటుందని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. కశ్మీర్ పర్యటను దూరంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు కూడా కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని వెల్లడించాయి. కాగా, ఢిల్లీ అఖి లపక్షంతో చర్చించేందుకు రావాలంటూ వేర్పాటువాద నేతలకు జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ లేఖరాశారు.