భద్రతా భేటీలో ఏం నిర్ణయించారో!
న్యూఢిల్లీ: అటు పాకిస్థాన్తోపాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా పాకిస్థాన్ భూభాగంలో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేయాలని, దాడులు జరిగినట్లున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలోని రక్షణ పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పది రోజుల తర్వాత భారత ఆర్మీ పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని వస్తున్న డిమాండ్లను ముందునుంచి కేంద్ర తోసిపుచ్చింది. అయితే, ఇటీవలె రాజ్ నాథ్ సింగ్ వేచి చూడండని చెప్పడంతో వాటిని విడుదల చేస్తారనే అభిప్రాయం ఏర్పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడి ఫుటేజీ విడుదల అంశంపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.