
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ పటిమ మీద అపారమైన నమ్మకం ఉందని, ఆయన కష్టపడే తత్వమే ఈ స్థాయికి తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో ప్రపంచ దేశాల వేదికపై భారత్‌ను గర్వపడేలా చేశారని అన్నారు. (ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ)
అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను, విజయాలను ప్రతి గడపకు చేరవేసిన కోట్లాది కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. కాగా అంచనాలను తలకిందులు చేస్తూ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేటితో తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment