
అమృత్‌సర్ : విడుదలైన ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్‌లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్ సెంట్రల్ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్నిచోట్ల వాటర్ కూలర్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇటీవలే కొందరు ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి ఈ విషయం తెలిసింది. దీంతో తాము కూడా జైలు కోసం కూలర్ బహూకరిస్తామని అభ్యర్థించారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఓ వాటర్ కూలర్‌ని తెచ్చి వారికి అందజేశారు. అయితే, కూలర్ విషయంలో జైలు సిబ్బందికి ఎక్కడో అనుమానం వచ్చింది. దాంతో తెరచిచూసిన అధికారులు కంగుతిన్నారు. అందులో నుంచి ఏకంగా 1780 బీడీ కట్టలు, రెండు ప్యాకెట్ల పొగాకు బయటపడ్డాయి. జైలు లోపల ఉన్న తమ సహచర ఖైదీల కోసం విడుదలైన ఖైదీలు ఈ ప్లాన్ వేశారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. మహిందర్ సింగ్ అనే వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment