సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు.
చర్చకు సిద్ధమే..
మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment