ప్రధానితో ముగిసిన చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడే మార్గాలు అన్వేషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ సందర్భంగా ప్రధానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఫోన్ ట్యాపింగ్ అంశాన్నికూడా చంద్రబాబు... ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలని మోదీని కోరినట్టు తెలిసింది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలను కూడా.... మోదీకి వివరించారని సమాచారం. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వరుసగా భేటీ కానున్నారు.
మరోవైపు ఇక ఓటుకు నోటు డీల్ కేసు వ్యవహారంలో చంద్రబాబుకు సాయంగా... ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డిజీపీ రాముడు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌ను కలిశారు. సీఎం ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్‌లో అధికారాలు గవర్నర్ చేతిలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.