కారప్పొడితో అభిషేకం చేయించుకుంటున్న స్వామీజీ
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఒక స్వామీజీ 31 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సత్‌వచ్చారి గంగమ్మ ఆలయం వద్దకు 4 నెలల క్రితం ఈ స్వామీజీ వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక తోటలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ స్వామీజీ పేరు, ఊరు ఎవరికీ తెలియదు. ఈ స్వామీజీ తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో మాట్లాడుతారు.
ఈ స్వామీజీ ప్రత్యంగరా దేవిని ప్రతి రోజూ పూజిస్తుంటారు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన పూజించే ప్రత్యంగరా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.తన ఇంట్లోనే కారంపొడి నీటితో అభిషేకం చేయించుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని తొలుత స్వామీజీ చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక అండా(పెద్దపాత్ర)లో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అభిషేకం చేశారు. అనంతరం నీటితో కూడా స్వామివారికి అభిషేకం చేశారు.
**