
చైనా దుస్సాహసం
ఈటానగర్: పైకి మిత్రుడిగా నటిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 250 మంది సైనికులు గత వారం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దు ప్రాంతమైన కమేంగ్ జిల్లాలోకి జూన్ 9న.. భారీ ఆయుధాలు కలిగిన సుమారు 250 మంది ఎర్ర సైనికులు చొరబడ్డారని, దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే గడిపి, తిరిగి వెళ్లిపోయారని రక్షణ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అణుసరఫరా దేశాల కూటమిలో భారత్ చేరికను గట్టిగా వ్యతిరేకిస్తోన్న చైనా.. వీలైననన్ని వక్రమార్గాల్లోనూ ఇండియాను రెచ్చగొట్టాలని చూస్తోంది. గతంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ పై చర్యల ప్రక్రియకు చైనా అడ్డుతగిలిన సంగతి తెలిసిందే.
కాగా, గడిచిన రెండు మూడేళ్లలో పలు మార్లు సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఆ దేశ అధ్యక్షుడు జింగ్ పిన్ భారత్ పర్యటన తర్వాత కాస్త వెనక్కుతగ్గింది. సరిగ్గా కమేంగ్ జిల్లా తూర్పు ప్రాంతమైన యంగ్టే వద్ద చైనీస్ ఆర్మీ భారత్ లోకి చొరబడిందని, ఈ ఏడాదిలో చోటుచేసుకున్న మొదటి చొరబాటు ఇదేనని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. తదుపరి ఏం చెయ్యాలనేదానిపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.