- ‘స్థానికత’ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 2, 2017 నాటికి
- వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని గెజిట్‌లో పొందుపరిచింది. ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు–1974ను సవరిస్తూ రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. ఒక అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వస్తే వారిని ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్‌గా గుర్తిస్తారు. వారిని స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. విద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు.
ఉద్యోగాలకు సంబంధించి..: ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉత్తర్వులు–1975ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1975లోని ఉత్తర్వుల్లో పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి(లోకల్ క్యాండిడేట్)గా గుర్తిస్తారు.
ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. ఉద్యోగాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. కాగా, రాష్ట్రపతి జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్థానికత కోరుకునే వారు ఇప్పటికే అక్కడికి వెళ్లుంటే పరవాలేదు. లేదంటే మరో ఏడాదిలోపు వెళ్లాల్సి ఉంటుంది.