నిబంధనలనుంచి మినహాయింపు కోరిన 'యాపిల్'
అమెరికాకు చెందిన ఐఫోన్, ఐ ప్యాడ్ తయారీ సంస్థ యాపిల్ విడిభాగాల సమీరకణ నిబంధనలపై మరోసారి మినహాయింపును కోరింది. ఈ నేపథ్యంలో యాపిల్.. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక మండలి (డిప్) కు ఓ ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని దుకాణాలతోపాటు, ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి కోరిన సంస్థ.. డీఐపీపీకి వివరణ ఇచ్చింది.
భారత్ లో వస్తువులను విక్రయించాలంటే 30 శాతం విడి భాగాలను దేశీయంగా సమీకరించాలన్న నిబంధన నుంచి యాపిల్ సంస్థ మినహాయింపు కోరుతూ మరోసారి వివరణ ఇచ్చింది. అమెరికా ఆధారిత సంస్థ దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి ఆమోదం కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) నిబంధనల ప్రకారం అత్యున్నత సాంకేతికత ఇమిడి ఉండే సింగిల్ బ్రాండ్ ఉత్పత్తులకు నిబంధనలు తప్పనిసరి చేసే అవకాశం లేకపోవడంతో యాపిల్ కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్ త్వరలోనే యాపిల్ సంస్థ ధరఖాస్తును స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సమీక్షించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీఐపిపి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్డీఐ అనుమతి 100 శాతం ఉంది. కానీ కంపెనీలు 49 శాతం మించి ఉన్నపుడు ఎఫ్ ఐపిబి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను తమ స్వంత రిటైల్ దుకాణాల ద్వారా చైనా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం యాపిల్ స్వంత దుకాణాలను తెరవలేదు. రెడింగ్టన్, ఇన్ గ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తో పాటు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ గ్జియామీ కూడ భారత్ లో సింగిల్ బ్రాండ్ విక్రయశాలల ప్రారంభానికి అనుమతికోసం ధరఖాస్తు చేసుకుంది.