ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాలు... భవిష్యత్తుకు భరోసా ఇస్తారనే ఊహాగానాల నడుమ మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం.
న్యూఢిల్లీ : ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాలు... భవిష్యత్తుకు భరోసా ఇస్తారనే ఊహాగానాల నడుమ మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం. ద్రవ్యలోటు, ప్రపంచ దేశాల్లో ఆర్థిక అస్థిరతను ప్రస్తావించిన విత్తమంత్రి జైట్లీ... పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 5 కంటె తక్కువగా ఉందన్న ఆయన 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని ప్రకటించారు.
అలాగే ఆర్థిక లోటుకు పగ్గాలు వేయడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపిన జైట్లీ ప్రస్తుతం 4.1 శాతంగా ఉన్న ఆర్థిక లోటును వచ్చే మూడేళ్లలో 2016-17 ఆర్థిక సంవత్సరం నాటికి 3 శాతానికి తగ్గించడానికి కృషి చేస్తామని తెలిపారు. దాదాపు 17.90 లక్షల కోట్ల రూపాయలతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన ఆయన పన్ను వసూళ్ల ద్వారా 13న్నర లక్షల కోట్లు సాధించగలమని అంచనా వేశారు.