సమస్యలపై కేజ్రీ దర్బార్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ను ప్రారంభించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇలా చేసినా.. అప్పట్లో సరైన ప్రణాళిక లేక.. అది మధ్యంతరంగా ఆగిపోయింది. ఈసారి పూర్తిస్థాయిలో అధికారం దక్కించుకున్న ఆయన సమస్యలున్నవారు నేరుగా రావాలంటూ కార్యక్రమం ప్రారంభించారు.
బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఆయన ఘజియాబాద్లోని తన పార్టీ కార్యాలయం కౌశాంబిలో ప్రజాదర్బార్ నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి 200 మందిని ఆహ్వానించి నలుగురు చొప్పున లోపలకు పిలిచి వారి సమస్యలు విన్నారు. ఇక నుంచి ఇది ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం పార్టీ అనవాయితీగా నిర్వహించే కార్యక్రమంలా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ), కార్మిక, విద్యుత్, మున్సిపాలిటీ శాఖల్లోని సమస్యలు ప్రజల నుంచి తెలుసుకుంటారు. వీటిపై ముందుగా నిర్ణయించిన తేదీల్లో ప్రజల స్పందన కోరుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అధికారులు కూడా తాము కేటాయించిన ఫోన్ నంబర్లకు కాల్ చేయడం ద్వారా గానీ, ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా గానీ ప్రభుత్వంతో మమేకం కావొచ్చిన పార్టీ నేతలు తెలిపారు.