సుప్రీంకోర్టు వద్ద మహంత్ ధరమ్ దాస్
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి విచారించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలోపే కక్షిదారుల తరపు న్యాయవాదులు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను పూర్తిగా నింపి, తర్జుమా చేసుకుని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఏవైనా సమస్యలుంటే రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది. దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈ కేసుకు సంబంధించి అప్పీలును వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత 2019లో విచారణకు స్వీకరించాలని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. దీన్ని ధర్మాసనం తిరస్కరించింది.
అప్పటికల్లా తర్జుమా కష్టమే: సిబల్
కేసు విచారణకు పరిస్థితులు అనుకూలంగా లేవని.. 2019 జూలై 15కు ఈ కేసును వాయిదా వేయాలని సిబల్ కోర్టును కోరారు. కేసుకు సంబంధించిన 19వేలకు పైగా పత్రాలను తర్జుమా చేయటం, వివరాలను పూర్తి చేయటం.. ఇంత తక్కువ (వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నాటికి) సమయంలో సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. దీంతోపాటుగా ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం నుంచి ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మార్చాలని విన్నవించారు. అయితే కేసును వాయిదా వేయాలన్న సిబల్ వాదనను సీజేఐ జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీబ్‌లు సభ్యులుగా ఉన్న బెంచ్ తిరస్కరించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, రెండో భాగాన్ని నిర్మొహి అఖాడాకు, మూడో భాగాన్ని రామ్‌లల్లాకు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సిబల్ వాదిస్తున్నారు.
సిబల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
ఈ కేసు తుది విచారణ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరపాలన్న సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. సిబల్ వ్యాఖ్యలపై, అయోధ్య కేసుపై కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీ గుజరాత్‌లో గుళ్లలో తిరుగుతున్నారు. అటు సిబల్ మాత్రం రామజన్మభూమి కేసును వాయిదా వేస్తున్నారు. అసలు అయోధ్య కేసులో వాదనలు వినేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? లేదా?’ అని షా ప్రశ్నించారు. అయితే, సిబల్ కోర్టులోపలి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ చెప్పింది.
అసలైన కక్షిదారులు లేకుండానే..
కేసుకు సంబంధించిన అసలైన కక్షిదారులు లేకుండానే 25 ఏళ్ల క్రితం నాటి రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం తుది విచారణ ప్రారంభమైంది. రామమందిరం ఉన్న ప్రాంతంలో పూజ, దర్శనం కోసం అనుమతించాలంటూ 1949లో మహంత్ రామచంద్రదాస్ పరమహంస కోర్టును ఆశ్రయించారు. మరోవైపు, బాబ్రీ మసీదు నుంచి రాముడి విగ్రహాలు తొలగించాలంటూ హషీమ్ అన్సారీ కోర్టుకెక్కారు. పరమహంస 2003 జూలై 20న కన్నుమూయగా.. గతేడాది జూలైలో అన్సారీ మృతి చెందారు. దీంతో కేసు తుది విచారణలో అసలైన కక్షిదారుల భాగస్వామ్యం లేదు. కాగా, బాబ్రీ మసీదు విధ్వంసానికి నేటితో 25 ఏళ్లు పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment