కోల్‌కతా: చిన్న వయస్సులోనే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా అది గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతమని ఓ అధ్యయనంలో తేలింది. మగవారిలో 40 ఏళ్ల కంటే ముందుగానే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా గుండె జబ్బులు వచ్చే అవకాశం.. ఊబకాయం ఉన్న వారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని రుజువైంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కుటుంబంలోని వ్యక్తికి పిన్న వయస్సులోనే గుండెజబ్బులు వచ్చినా, ఒబెసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా, పొగతాగే అలవాటున్న వారికి గుండెరక్తనాళాల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయని.. కానీ, బట్టతల, జుట్టు నెరవటం, ఒబెసిటీ లక్షణాలను బట్టి గుండె రక్తనాళాల్లో సమస్యలను తేలిగ్గా గుర్తించే వీలుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ముందుగానే తల వెంట్రుకలు నెరిసిన వారిలో మిగతా వారితో పోలిస్తే 50 శాతం అధికంగా రక్తనాళాల్లో సమస్యలు ఎక్కువగా రావచ్చని, అదే బట్టతల వచ్చిన వారిలో మిగతా వారితో పోలిస్తే 49 శాతం ఎక్కువగా ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు గుజరాత్‌లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చి సెంటర్‌కు చెందిన సచిన్ పాటిల్. చిన్న వయసు లోనే తలవెంట్రుకలు నెరిసినా బట్టతల వచ్చినా ఆమేరకు రక్తనాళాల వయస్సులో కూడా మార్పులు సంభవిస్తాయని ఆయన తెలిపారు.
ఇటీవల కోల్‌కతాలో జరిగిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను ప్రకటించారు. అధ్యయనంలో భాగంగా 40 ఏళ్ల లోపు 790 మంది పురుషుల్లో గుండెరక్తనాళాల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ ఫలితాలను అదే వయస్సు కేటగిరీకి చెందిన 1,270 ఆరోగ్య వంతులైన పురుషులతో పోల్చి చూశారు. మిగతా వారితో పోలిస్తే ఒబెసిటీ ఉన్న వారిలో 4.1 రెట్లు ఎక్కువగా రక్తనాళాల్లో సమస్యలు వస్తుండగా ముందుగానే జట్టు నెరవటం, బట్టతల కారణంగా ఆ ముప్పు 5.6 రెట్లు ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే చిన్న వయస్సులోనే జట్టు తెల్లబడుతున్న లేదా బట్టతల వస్తున్న వారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు, చికిత్స అవసరమో నిర్ణయించటం మరింత సులువు కానుందని కార్డియాలజిస్ట్ ధమ్‌దీప్ హుమానే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment