ఇటీవల కాలంలో కొంతమంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఇద్దరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదని బెంగళూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ షూస్ విసిరారు. ఇదంతా కెమెరాలో బంధించిన ఒకతను, యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే వెంటనే ఆ కానిస్టేబుల్ పోస్టు కూడా ఊడి, సస్పెండ్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే...రోడ్డుకు పక్కన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వేచిచూస్తూ ఉన్నారు. వారి పక్క నుంచే హెల్మెట్స్ పెట్టుకోకుండా ఇద్దరు బైకర్లు వెళ్తూ కనిపించారు. వారిని చూసిన ఒక ట్రాఫిక్ పోలీసాఫీసర్ షూ తీసి, వారిపైకి విసిరారు. బైకర్లలో ఒకరికి ఈ షూ తగిలింది. అయినా వాళ్లిద్దరూ ఆగకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటన్నంతటినీ ద్విచక్ర వాహనదారుల వెనుకాలే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న రిషబ్ ఛటర్జీ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న బీఈఎల్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు రిషబ్ పేర్కొన్నాడు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను తాము ప్రేమిస్తామని, కానీ ఇటు పోలీసులు, అటు బైకర్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఈ పోస్టుకు ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఎఫ్‌బీకి కూడా దీన్ని షేర్ చేయాలని కోరాడు. నెంబర్ ప్లేట్‌ను నమోదు చేసుకుని, వారికి జరిమానా విధించవచ్చు కదా అని యూజర్లంటున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని, బైకర్ల జీవితాలకు ప్రమాదం తెచ్చే బదులు, జరిమానా కోసం నోటీసులు పంపవచ్చని పేర్కొంటున్నారు. బైకర్లపైకి షూస్ విసిరే హక్కులు పోలీసులకు లేవన్నారు.
కానిస్టేబుల్ ఈ పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండాల్సి ఉండేదని యూట్యూబర్ కూడా అన్నాడు. ‘ఈ సంఘటనను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఫోటో తీసి, జరిమానా విధించాలి. బెంగళూరులో చాలా మంది పోలీసులు వద్ద డిజిటల్ కెమెరాలు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించే వారిని రికార్డు చేయవచ్చు. పలు మార్గ కూడలిలో ఏర్పాటు చేసిన కెమెరాలతో వాహన నెంబర్‌ను ట్రాక్ చేయవచ్చు’ అని యూట్యూబర్ పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోతో, ఆ పోలీసు కానిస్టేబుల్ పదవి పోవడమే కాకుండా.. జలహాలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే బైక్‌పై వెళ్లిన ఆ ఇద్దరు యువకులు మాత్రం కానిస్టేబుల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment