
సీసీటీవీ షాకింగ్: యువతిని ఎత్తుకెళ్లి..
బెంగళూరు నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన పేయింగ్ గెస్ట్‌హౌస్ ఎదురుగా 25 ఏళ్ల యువతి ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమెను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకెళ్లి ఆమెపై బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దక్షిణ బెంగళూరులోని కట్రిగుప్పెలో ఏప్రిల్ 23న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బాధితురాలు బలంగా ప్రతిఘటించింది. అతని చేతిని గట్టిగా కొరికి.. అతని బారి నుంచి తప్పించుకుంది. అనంతరం తన పెయింగ్ గెస్ట్ గదికి వచ్చి తనపై జరిగిన అకృత్యాన్ని వివరించింది. బాధితురాలు కల్యాణ్ నగర్‌లోని బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. గత నెల 23న రాత్రి ఆమె స్నేహితుడు తన పెయింగ్ గెస్ట్ రూమ్ సమీపంలోని మారెమ్మ ఆలయం వద్ద బాధితురాలిని దిగబెట్టాడు. ఆ తర్వాత ఫోన్ రావడంతో అక్కడే తచ్చాడుతూ ఆమె ఫోన్‌లో మాట్లాడింది.
ఇదే అదనుగా భావించిన దుండగుడు వెనుక వైపునుంచి ఆమెను చుట్టేసుకొని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న పాదచారులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దుండగుడి నుంచి తప్పించుకున్న ఆమె అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేయకుండా పెయింగ్ గెస్ట్ రూమ్ యాజమాని తనను ఒత్తిడి చేశాడని, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు చెప్తున్నది.