
ఘోరంగా తిడుతూ నన్ను ఎత్తుకెళ్లాడు!
బెంగళూరు: పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా ఫోన్‌లో మాట్లాడుతున్న తనను అమాంతం ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని, తనను అనరాని మాటలంటూ, 'వేశ్య' అని ఘోరంగా తిడుతూ అతడు తనపై అఘాయిత్యం చేయబోయాడని బెంగళూరు బాధితురాలు వెల్లడించింది. బెంగళూరులోని కట్రిగుప్ప వద్ద గత నెల 23న తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరో ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు. ఈ కేసులో నత్తనడకన విచారణ జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు తనపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని తాను గుర్తిస్తానని స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కేకలు పెట్టిన ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
' నా పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా నేను ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం నన్ను ఎత్తుకున్నాడు. నన్ను ఓ జంతువులా పట్టుకొని దగ్గర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లాడు. నాకు ఏం జరుగుతుందో కూడా కొంతసేపు అర్థం కాలేదు. నన్ను కిందపడేసి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో పోరాడాను. అతన్ని వెనక్కినెట్టి పరిగెత్తాను. నా జట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మళ్లీ నేలపై పడేశాడు. నేను గట్టిగా అరుస్తూ ఏడ్చాను. ఎవరూ నన్ను రక్షించేందుకు ముందుకురాలేదు. చివరకు అతని చేయి గట్టిగా కోరికి.. అతన్ని నుంచి తప్పించుకొని నా గదివైపు పరిగెత్తాను' అని బాధితురాలు వివరించింది. బాధితురాలి కుటుంబసభ్యులు మణిపూర్‌కు చెందినవారు. బెంగళూరులోనే పుట్టిన పెరిగిన ఆమె ప్రస్తుతం ఓ బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది.