తెల్లారింది లెగండోయ్..
తెల్లారింది లెగండోయ్..
Published Sat, Jul 1 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
- ఉదయం నుంచి రాత్రి దాకా... ఇదీ ప్రభావం
- ఎగువ మధ్యతరగతికి నెలవారీ చిల్లే
అపుడెపుడో డెబ్భై ఏళ్ల కిందట... అర్ధరాత్రి స్వతంత్రమొచ్చింది. ఎదురుచూసీ చూసీ ఉన్న జనానికి... తెల్లారేసరికల్లా కొత్త ప్రపంచంలోకి వచ్చేశామని అర్థమైపోయింది.
ఇప్పుడు అదే అర్ధరాత్రి... బోలెడన్ని పన్నుల నుంచి స్వతంత్రమొచ్చింది. మీడియాలో వినీవినీ చూసీచూసీ ఉన్న జనానికి.. తాము జీఎస్‌టీ రాజ్యంలోకి ప్రవేశించామని తెల్లారకముందే తెలిసిపోయింది.
మరి ఈ కొత్త రాజ్యంలో మధ్య తరగతి మనిషి శివ జీవితం ఎలా మొదలైంది? తెల్లారింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా శివపై ఈ కొత్త పన్ను ప్రభావం ఎలా ఉంది? ఒక్కసారి తన కళ్లతోనే చూద్దాం...
సాక్షి, బిజినెస్ విభాగం: బద్ధకంగా నిద్రలేస్తూనే బ్రష్ పట్టుకుని బాత్రూమ్‌లోకి దూరాడు శివ. జీఎస్‌టీతో రేటు తగ్గిన టూత్‌పేస్ట్.. కాస్త రుచిగా అనిపించింది. స్నానం చేసేటపుడు సబ్బు కాస్త తేలిగ్గా అనిపించినా.. షాంపూ మాత్రం భారమైంది. టిఫిన్‌కి కూర్చున్నాక తెలిసింది... అల్పాహారం కాస్త ఖరీదయిందని. అల్పాహారమే కాదు. టేబుల్ మీది పాత్రలు, స్పూన్లు సైతం కాస్త ప్రియమయ్యాయి. ఒక్కోసారి టిఫిన్ చేయకపోతే కార్న్‌ఫ్లేక్స్‌తో కానిచ్చేస్తాడు శివ. కానీ అవి మరింత భారమయ్యాయని అప్పుడే తెలిసింది. సరే! ఎలాగోలా టిఫిన్ అయిందనిపించాడు. ఆఫీసుకు బయల్దేరటానికి రెడీ అయ్యాడు.
► బీరువా తీయగానే షర్ట్‌లు, ప్యాంట్‌లు మెరిసిపోతూ కనిపించాయి. సంగతేమిటని ఆరా తీస్తే... ధరలు తగ్గే జాబితాలో ఉన్నామని బదులిచ్చాయి. ఖరీదైన, చవకైన దుస్తులు కూడా తమ స్థాయిని బట్టి మరింత చౌకగా మారుతున్నామని చెప్పేశాయి. హుషారుగా ఈల వేస్తూ... షూ రాక్ దగ్గరికి చేరాడు శివ. అక్కడికెళ్లేసరికి ఆ సంతోషం ఆవిరైపోయింది. ఎందుకంటే మంచి జీతగాడు కాబట్టి ఖరీదైన చెప్పులే అలవాటు అతనికి. కానీ అవి ప్రియమయ్యే జాబితాలో ఉన్నామంటూ వెక్కిరించాయి. ఆఖరికి చేతి వాచీ కూడా చెప్పులతో పాటేనని చెప్పేసింది. చేసేదేమీ లేక బయటికొచ్చి బండి తీశాడు. పెట్రోలును జీఎస్‌టీ పరిధిలోకి తేలేదు కాబట్టి ఏ మార్పులూ ఉండవని అర్థమైంది.
► ఆఫీసుకెళ్లాడు శివ. ఒకటో తేదీ కావటంతో మిత్రుల నుంచి, అప్పున్న కంపెనీల నుంచి ఫోన్లే ఫోన్లు. తాను చేయాల్సిన ఫోన్లు కూడా చాలానే ఉండటంతో అన్నీ ఒకటొకటిగా ముగించాడు. అప్పుడే తెలిసింది. ఇకపై ఫోన్ బిల్లు కాస్తంత పెరుగుతుందని. ఫోన్ బిల్లే కాదు. ఫోన్ పాడైతే కొత్తది కొనాలన్నా కాస్త ఎక్కువ పెట్టక తప్పదని. చుట్టూ ఉన్న కంప్యూటర్లు, ప్రింటింగ్ ఉపకరణాలు అన్నీ ధరలు పెరిగే జాబితాలో ఉన్నా... అవన్నీ ఆఫీసు లెక్కల్లోనివే కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కాకపోతే ఆఫీసుపై పడే భారం.. మున్ముందు తన జీతానికీ ఎసరు పెట్టొచ్చని మనసులో పీకుతూనే ఉంది. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్‌కు కూర్చున్నాక తెలిసింది. అది కూడా కాస్త భారమయ్యే జాబితాలోనే ఉందని.
► సాయంత్రం ఇంటికొచ్చాడు. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ అన్నీ చూస్తుంటే... స్వల్పమే అయినా వాటన్నిటిపైనా పన్నులు పెరుగుతున్నాయన్న విషయం గుర్తొచ్చింది శివకు. ‘‘వీటిలో ఏదైనా పాడై కొత్తది కొనాలంటే కష్టమే కదా!’’ అనుకున్నాడు.
బోర్ కొడుతోంది కదా అని టీవీ ఆన్ చేశాడు. అప్పుడే గుర్తొచ్చింది. టీవీపై పన్ను తగ్గుతోందని. కానీ టీవీలో బొమ్మ ఖరీదు పెరుగుతోందని కూడా గుర్తుకొచ్చింది. అంటే... ఇకపై కేబుల్ టీవీ, డిష్ ఛార్జీలపై పన్ను పెరుగుతోందని. పోనీ టీవీలో ఇంటర్నెట్ పెట్టుకుందామంటే... అది కూడా కాస్త పెరగబోయే జాబితాలోనే ఉంది. ‘అమ్మో! ఇక ఎంటర్‌టైన్‌మెంట్ అంత ఈజీ కాదు!!’ అనుకున్నాడు.
► రాత్రి పదవుతోంది. ఇంతకీ రోజువారీ వాడే వస్తువుల్లో చూస్తే ధరలు పెరిగేవెన్ని? తగ్గేవెన్ని? అంచనా వేయటానికి ప్రయత్నించాడు శివ. లేచిన దగ్గర్నుంచి చూస్తే ధరలు తగ్గే వస్తువులకన్నా పెరిగేవే ఎక్కువగా కనిపించాయి. కాకపోతే ఆ పెరుగుదల మరీ భారీగా లేదనిపించింది. కొంచెమే కదా... అనుకున్నాడు. ఆ కొంచెం కొంచెం.. తన జేబుకెంత చిల్లు పెడుతుందో లెక్కేయటానికి ప్రయత్నించేలోగానే నిద్ర ముంచుకొచ్చి దుప్పటి చేతికొచ్చింది. కాకపోతే... ఆ దుప్పటి కూడా పన్నుపోటును కాస్తంత పెంచే జాబితాలోనే ఉంది!!!
Advertisement
Advertisement