
ప్రతీకాత్మకచిత్రం
జాబ్ డేటాతో మోదీకి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఉపాధి కల్పనలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందని విపక్షాలు చేస్తున్న ముప్పేట దాడి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన గణాంకాలు అందివచ్చాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో మోదీ సర్కార్‌కు ఊరట ఇచ్చేలా ఉద్యోగ గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 9 లక్షల కొత్త ఉద్యోగాలు పలు రంగాల్లో సమకూరాయని ఈపీఎఫ్‌ఓ పేరోల్ డేటా తెలిపింది. జనవరిలో లభించిన కొలువులు గత ఏడాది అదే నెలతో పోలిస్తే 131 శాతం అధికం కావడం గమనార్హం.
అంతకుముందు ఏడాది ఇదే నెలలో కొత్తగా 3.87 లక్షల మంది ఉద్యోగ భవిష్యనిధి చందాదారులుగా చేరినట్టు ఈ గణాంకాలు వెల్లడించాయి. ఇక 2017 సెప్టెంబర్‌లో 2,75,609 నికర ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 2017 నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 76.48 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. గత 17 నెలల్లో సంఘటిత రంగంలో ఈ ఉద్యోగాలు సమకూరినట్టు ఈ డేటా ద్వారా వెల్లడవుతోంది. మరోవైపు ఈ ఏడాది జనవరిలో ఏకంగా 9 లక్షల మంది ఉద్యోగులు 17 నెలల గరిష్ట స్ధాయిలో ఈపీఎఫ్‌ఓ చందాదారులుగా నమోదవడం గమనార్హం.