
మావోయిస్టుల వసూళ్లలో తప్పులేదు: సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ అంటేనే వివాదాల పుట్ట. తాజాగా ఆయన మావోయిస్టుల ను వెనకేసుకొచ్చి కొత్త వివాదం మూటగట్టుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, ఇతర ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని మాంఝీ చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతివారం తన ఇంట్లో నిర్వహించే జనతా దర్బార్ కార్యక్రమం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
''మావోయిస్టులు విదేశీయులా? మావోయిస్టులుగా మారినవాళ్లు కూడా మన సమాజానికి చెందినవాళ్లే. అభివృద్ధి ద్వారా వాళ్లను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు గానీ, తుపాకులతో బెదిరించలేం'' అని మాంఝీ అన్నారు. తాను మూడేళ్ల క్రితం నితిష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు కొందరు మావోయిస్టులు తన వద్దకు వచ్చారని, తమ వసూళ్లను సమర్థించాల్సిందిగా కోరారని కూడా చెప్పారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కు అయిపోయి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తున్న విషయాన్ని వాళ్లే చెప్పారన్నారు. 3-4 లక్షల రూపాయల విలువచేసే పనులకు 11 లక్షలు తీసుకుంటున్నారని, పైగా వాటిలో నాణ్యత కూడా ఉండట్లేదని సీఎం మాంఝీ తెలిపారు. 7 లక్షల లాభం పొందుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు లక్ష రూపాయలు వసూలు చేయడంలో తనకు ఏమాత్రం తప్పు కనిపించడం లేదన్నారు.