
సాక్షి, న్యూఢిల్లీ : ఇటువంటి వాళ్లని చూసినప్పుడు ప్రేమ గుడ్డిది.. అందులో సందేహం లేదనిపిస్తుంది. ప్రేమ పేరుతో వంచించిన యువకుడు.. మోసాన్ని కూడా నిజమని నమ్మి.. అతని కోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డ యువతి.. ఇది ఒక యధార్థ గాథ. బిహార్‌లో జరిగింది. ఆశ్చర్యం, బాధ తెప్పించే ఘటన వివరాలివి.
21 ఏళ్ల బిహార్ యువతి 2 లక్షల రూపాయలకు తన కిడ్నీ అమ్ముకునేందుకు ఢిల్లీలోని ఒక ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ మాట్లాడుకున్నాక.. సర్జరీ కోసం వైద్యులు ఢిల్లీకి రమ్మని చెప్పారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులకు ఈ కాల్‌పై అనుమానం కలిగింది. కిడ్నీ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానం పోలీసులకు వచ్చింది. వెంటనే అధికారులు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్యూ)కు సమాచారం అందించి.. కిడ్నీ అమ్మకాన్ని నిలిపాలని సూచించించారు.
అక్కడకు వెళ్లిన డీసీడబ్యూ అధికారులకు యువతి చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రూ. 2 లక్షలు కావాలి.. అందుకోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయినట్లు తెలిపింది. దాదాపు మూడేళ్లుగా ఒక వ్యక్తిని ప్రేమించానని.. అతను కూడా తనను ప్రేమించినట్లు యువతి తెలిపింది.
ఇదిలా ఉండగా.. అతనికి ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని తెలిపింది. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొమ్మంటే.. రూ. 2 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్లు ఆమె చెప్పింది. అతను కోరిన మొత్తం ఇచ్చేందుకే కిడ్నీ అమ్ముకుంటున్నానని తెలిపింది. యువతి చెప్పిన మాటలకు షాక్ తిన్న డీసీడబ్యూ అధికారులు ఆమె ప్రియుడిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment