
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఆయన అధికారులతో సమావేశమైన ఫొటోలను బీజేపీ పార్టీ నాయకత్వం విడుదల చేయడాన్ని సోషల్ మీడియా తప్పు పట్టడమే కాకుండా తీవ్రంగా దుయ్య పడుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ని విశ్రాంతి తీసుకోనీయకుండా ఇంకా విధులు నిర్వర్తింప చేయడమేమిటని ప్రశ్నిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించే మనోహర్ పరీకర్ బీజేపీ నాయకత్వం విడుదల చేసిన ఫొటోల్లో చిక్కి శల్యమై కనిపించడం సోషల్ మీడియాను తీవ్రంగా కదిలించింది.. కలచివేసింది.
అక్టోబర్ 30, అక్టోబర్ 31వ తేదీల్లో ముఖ్యమంత్రి పరీకర్ తన నివాసంలో తోటి మంత్రులు, అధికారులతో సమావేశమైన దశ్యాలకు సంబంధించిన ఫొటోలను బీజేపీ నాయకత్వం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. నానాటికి ఆరోగ్యం క్షీణిస్తున్న మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రిగా తన విధులను సంక్రమంగా నిర్వర్తించలేక పోతున్నారని తెలిస్తే ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందోనన్నది అటు రాష్ట్ర, ఇటు కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. అందుకు కారణం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా నాలుగు సీట్లు తక్కువ సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతర పొత్తుల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. (సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?)
‘భయం గొలిపే ఇలాంటి ఫొటోను విడుదల చేయడం నిజంగా నీచం. దయచేసి ఆ ఫొటోను వైరల్ కానివ్వకండి. వారం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. వారిని క్షమించండి. ఓ ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా సాగనంపాలనే సంస్కతిని కూడా పార్టీ మరచిపోయినట్టుంది’ అని పరీకర్ ఫొటో పట్ల మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభాకర్ టింబ్లే వ్యాఖ్యానించారు. ‘సీఎం చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయనపై దయవుంచి గౌరవప్రదంగా రాజీనామా చేయనీయండి. (సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి!)
ఆయన జీవితం కన్నా బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే కావాలనుకుంటా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు’ అని సోషల్ మీడియాలో నిక్సన్ ఫెర్నాండేజ్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఫొటోలో కనిపిస్తున్నది నిస్సందేహంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్‌గారే, కాదనడం లేం, ఆయన్ని ఆ స్థితిలో చూస్తుంటే ఆయనింకేమాత్రం విధులు నిర్వర్తించేలా కనిపించడం లేదు’ అని ‘గోవన్ డెయిలీ’ పత్రిక వ్యాఖ్యానించింది.
గత ఫిబ్రవరి నెల నుంచే
మనోహర్ పరీకర్ గత ఫిబ్రవరి నెల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన వారసుడి కోసం ఇటు పార్టీలోనూ, అటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లోనూ పోటీ పెరగడంతో ఇంతవరకు రాజీ కుదరలేదు. ఏ రెండు మిత్రపక్షాలు జారుకున్నా ప్రభుత్వం పడిపోతుంది. అందుకని ప్రభుత్వం పడి పోకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం పరీకర్‌నే కొనసాగిస్తూ వస్తోంది. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరగుపడుతోందని ఇప్పటికి రెండు సార్లు ప్రకటించిన పార్టీ, ఆయన మాటలను తెలియజేసే వీడియో రికార్డులను విడుదల చేయలేదు. తాజాగా ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆయన కోలుకుంటున్న లక్షణాలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment