'కోటి రూపాయల కోసం కిడ్నాప్ చేయలేదు'
గువాహటి: డబ్బు కోసం బీజేపీ నేత కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలను ఉల్ఫా తీవ్రవాద సంస్థ తోసిపుచ్చింది. తమ సమాచారం సైన్యానికి అందిస్తున్నందునే అతడిని కిడ్నాప్ చేశామని ఉల్ఫా చీఫ్ పరేశ్ బారువా వెల్లడించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిచిపెట్టేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాము డబ్బు డిమాండ్ చేయలేదని బారువా తెలిపారు. తమ గురించి సైన్యానికి కుల్దీప్ సమాచారం అందించడంతో తమ సంస్థకు చెందిన చాలా మందిని కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు. 'కుల్దీప్ క్షేమంగా ఉన్నాడు. ఆర్మీని ఇన్ఫార్మర్ అనే కారణంతో అతడిని కిడ్నాప్ చేశాం. మా కోర్టులో అతడిపై విచారణ జరుపుతాం. నిరపరాధి అని తేలితే అతడిని విడిచిపెడతామ'ని బారువా తెలిపారు.