గాంధీనగర్/న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగానే.. పలు మీడియా, ప్రైవేటు సంస్థలు మొదటివిడత సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్, టైమ్స్‌నౌ–వీఎంఆర్ సంస్థలు సర్వేల ఫలితాలను బుధవారం వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్ గ్రూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో నిర్వహించిన సర్వేలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురనుందని తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం 10 శాతం ఓట్లతో వెనకబడుతుందని తేలింది. 68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 43–47 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 21–25 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే తెలిపింది.
రాజకీయ వేడి రాజుకున్న గుజరాత్‌లో బీజేపీ గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 182 స్థానాల అసెంబ్లీలో 48 శాతం ఓట్లతో 115–125 స్థానాలు బీజేపీ ఖాతాలోకే వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ 38 శాతం ఓట్లు సాధించి 57–65 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ సంస్థ ప్రభావం పెద్దగా ఉండబోదని కూడా ఇండియాటుడే–యాక్సిస్ సర్వే వెల్లడించింది. కేవలం గుజరాత్‌లోనే సర్వే నిర్వహించిన టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వే కూడా ఇక్కడ బీజేపీకి 118–134 సీట్లు వస్తాయంది. రాష్ట్రవ్యాప్తంగా 6వేల మందిని ప్రశ్నించిన టైమ్స్‌నౌ సర్వే.. కాంగ్రెస్ 49–61 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఈ సర్వే పేర్కొంది. 2012లో (మోదీ గుజరాత్ సీఎంగా) బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది.
సర్వేలో అభిప్రాయాలు
ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో 66% మంది ప్రధానిగా మోదీ ఉండటం వల్ల గుజరాత్‌కు మేలు జరిగిందని చెప్పగా, 74% మంది మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అయితే జీఎస్టీపై 51 శాతం మంది, నోట్ల రద్దుపై 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో ఇబ్బందులకు గురైనట్లు పేర్కొన్నారు. టైమ్స్‌నౌ సర్వేలో 46 శాతం మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు ‘గుజరాత్ అస్మిత’ (గర్వకారణం) అని అభిప్రాయపడగా.. 21 శాతం మంది ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. 81% మంది మోదీ ‘గుజరాత్ బిడ్డ’ అని.. ఆయన నేతృత్వంలోని బీజేపీకి ఓటేస్తామని తెలిపారు. 2012లో ఇదే అభిప్రాయం 60% మందిలో వ్యక్తమైంది. ఇరుపార్టీల ఓట్ల శాతంలో 2012తో పోలిస్తే పెద్దగా తేడా ఉండదని ఈ సర్వే పేర్కొంది. అయితే బీజేపీ ప్రభుత్వంపై గతంలో (2012లో 60 శాతం సానుకూలత) కంటే సదభిప్రాయం తగ్గింది. 54% మంది బీజేపీ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ కాస్త పెరగొచ్చని టైమ్స్‌నౌ పేర్కొంది.
గుజరాత్‌పై సర్వే ఫలితాలు
ఇండియాటుడే టైమ్స్‌నౌ
–యాక్సిస్ వీఎంఆర్
బీజేపీ 115–125 118–134
కాంగ్రెస్ 57–65 49–61
ఇతరులు 0–2 0–3
Comments
Please login to add a commentAdd a comment