నోట్ల రద్దు పై నాడో మాట..నేడో మాట!
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను నిషేధిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్య తరగతి, చిరు వ్యాపారులు, పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, కలుగుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నల్ల కుబేరులకు వత్తాసు పలుకుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముంది? నిజానిజాలను కాస్త పక్కనపెట్టి సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే అంశంపై బీజేపీ ఏమందో వీడియో సాక్షిగా పరిశీలించాల్సిన అవసరం, నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నకిలీలను, నల్లడబ్బును అరికట్టేందుకు అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ 2005 సంవత్సరానికి ముందున్న నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందంటూ సిఫార్సు చేశారు. ఈ చర్య వల్ల నల్లడబ్బు వెలుగులోకి రాకపోగా, మధ్యతరగతి, పేదలు, బడుగు వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పెద్ద ఎత్తున ఎగిరిపడింది. నోట్లను తాము నిషేధించడం లేదని, 2005కు ముందున్న నోట్లలో భద్రతా ఫీచర్లు తక్కువ ఉన్నాయన్న కారణంగా మాత్రమే వాటిని మార్చాలన్నది తమ అభిప్రాయమంటూ రఘురామ్ రాజన్ వివరణ ఇచ్చినా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఆ ప్రతిపాదనపై విరుచుకుపడ్డారు.
పేదలకే కష్టాలు, కన్నీళ్లు
‘2005 సంవత్సరానికి ముందున్న నోట్లను ఉపసంహరించాలంటూ కొత్త విధానాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. నల్లడబ్బు నుంచి దృష్టిని మళ్లించేందుకు తెచ్చిన ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలి. ఈ దేశంలో దాదాపు 65 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఉన్నవారికి కూడా వాటి బ్రాంచిలు దూరంగా ఉన్నాయి. వారిలో చదువుకున్న వారు కూడా తక్కువే. వారు తమ జీవితాంతం కష్టపడి కూడబెట్టిన కాసిన్ని కాసులను ఇంట్లోనే దాచుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల దెబ్బతినేది నల్లడబ్బు కాదు. వారు చాలా పొదుపుగా దాచుకున్న డబ్బుపై దెబ్బ పడుతుంది’ అని అన్నారు. పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు డబ్బులు మార్చుకునేందుకు దలారుల చేతుల్లో చిక్కుకుని, కొంత డబ్బును కోల్పోతారని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
నల్ల కుబేరులకు మార్గాలుంటాయి
‘నల్లడబ్బున్న వారు నగరాల్లో ఉంటారు. వారికి తమ డబ్బును మార్చుకునేందుకు అనేక మార్గాలుంటాయి. కానీ పేద వాళ్లు, సామాన్యులు, మహిళలు ఏం కావాలి? తమ భర్తల సంపాదనను అటకమీద డబ్బాల్లో, పప్పులో, బియ్యంలో దాచుకునే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి’ అని ఎంతో ఆవేదనతో మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. అమెరికా డాలర్లలో, విదేశీ కరెన్సీలో దాచుకునే నల్ల కుబేరులకు ఏం కాదని, పేదలు దాచుకునే నగదే కాలి బూడిదవుతుందని కూడా ఆమె హెచ్చరించారు. అంతటితోని ఆమె సరిపెట్టుకోకుండా ‘ఎకనామిక్ టై మ్స్’ పత్రికలో ఓ చిన్న ఆర్టికల్ కూడా రాశారు.
పేదలపై ప్రభావం ముందే చెప్పాలి
‘ఆర్బీఐ తాను తీసుకునే నిర్ణయం వల్ల ఎంత కరెన్సీమీద ప్రభావం ఉంటుందో కచ్చితంగా లెక్కకట్టాలి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతుందో కూడా తేల్చాలి. పేద ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా వేయాలి. మొత్తంగా ఉండే ప్రభావం ఏమీటో తేల్చి, వాటి వివరాలను ప్రజల ముందుంచాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ పత్రికలో ఆమె రాశారు. మరి ఆమె చెప్పినట్లుగా నోట్లను నిషేధించే ముందు మోదీ ప్రభుత్వం ఎంత కసరత్తు చేసిందో, ఎన్ని వివరాలు ప్రజల ముందుంచిందో, అప్పడో మాటకు ఇప్పుడో మాటకు కారణాలేమిటో కారకులను అడగి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టి నేడు సామాన్య ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలను అమిత్ షా స్వీయ నేత్రాల ద్వారానే చూసి తెలిసికుంటే ప్రజల కష్టాలతీర్చే మార్గాన్ని అన్వేషించవచ్చు!