బంతి అనుకుని బాంబు వేశాడు.. ముగ్గురికి గాయాలు
కోల్ కతా : స్కూలు ఆవరణలో ఓ బాంబు పేలడంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారు ఐదేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... బుర్ధ్వాన్ జిల్లా ఖందఘోష్ లోని దహుకా గిరిష్ ప్రాథమిక పాఠశాల పైకప్పు మీదికి శుక్రవారం కొందరు విద్యార్థులు ఎక్కారు. ఇంటి పని నిమిత్తం పక్కనే ఉండే పాఠశాలపైకి విద్యార్థులు ఎక్కినట్లు తెలుస్తోంది.
అందులో ఓ విద్యార్థి స్కూలు పైభాగంలో ఓ బ్యాగులో బాంబులను చూశాడు. అయితే అవి గుండ్రంగా బంతిలా ఉండటంతో ఆడుకునే బంతి అని ఆ విద్యార్థి భావించాడు. పైనుంచి ఓ బాంబును కిందకి విసిరాడు. స్కూలు ఆవరణలో భారీ శబ్దం చేస్తూ బాంబు పేలింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే బుర్ధ్వాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం స్కూలు పైభాగంలో మరో రెండు బాంబులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.