శభాష్ నితీశ్..!
మద్యపాన నిషేధంపై బిహార్ సీఎంను ప్రశంసించిన మోదీ
► దీన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
► పట్నాలో ఘనంగా గురుగోవింద్ 350వ ప్రకాశ్ పర్వ్
► ఉత్సవాల నిర్వహణపై ప్రముఖుల ప్రశంసలు
పట్నా: మద్యపాన నిషేధంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీన్ని విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని.. ఆయన కోరారు. పట్నాసాహిబ్ గురుద్వారాలో సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాశ్ పర్వ్ ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నితీశ్‌తో కలిసి మోదీ వేదిక పంచుకున్నారు. ఈ వేదికపై మద్యపానంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు విజయవంతంగా మద్యపానాన్ని అమలుచేశారని గుర్తుచేసిన నితీశ్.. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు చొరవతీసుకోవాలని కోరారు. దీనిపై మోదీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. మద్యపానంలో బిహార్ దేశానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
‘మద్యపానంపై ఉద్యమాన్ని ప్రారంభించినందుకు నితీశ్ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ నితీశ్ ఒక్కరో లేక ఒక పార్టీనో దీన్ని విజయవంతం చేయలేదు. అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రజాఉద్యమంలో భాగస్వాములు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మద్యపానాన్ని అమలుచేయాలని నితీశ్ కోరిన నేపథ్యంలో ఈ విషయంలో యావత్‌భారతానికే బిహార్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పాంచ్ పైరా పంత్’ ఏర్పాటుకోసం దేశాన్ని సంఘటితం చేయటంలో గురుగోవింద్ సింగ్ చేసిన ప్రయత్నం చాలా గొప్పదని మోదీ ప్రశంసించారు. ‘వివక్షకు తావులేకుండా గురుగోవింద్‌జీ అందరినీ ఒకేలా చూశారు.
ఆయన బోధనలు నేటి తరానికి స్ఫూర్తి’ అని మోదీ అన్నారు. పట్నాసాహిబ్ గురుద్వారలో ఈ 350 ఏళ్ల ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చొరవతీసుకున్న నితీశ్‌ను, బిహార్ ప్రభుత్వాన్నీ అభినందించారు. ఈ కార్యక్రమం కోసం కేంద్రం రూ.100 కోట్లను ప్రత్యేకంగా కేటాయించిందన్నారు.
గతంలో నోట్ల రద్దును సమర్థించిన నితీశ్
కొన్నేళ్లుగా రాజకీయ కారణాల వల్ల ఈ ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా మారారు. 2014 ఎన్నికల సమయంలో మోదీని ఎన్డీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించటంతో కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నితీశ్ బహిరంగంగానే సమర్థించటం, దీన్ని పలుమార్లు మోదీ ప్రస్తావించటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. కార్యక్రమానికి ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ప్రకాశ్ పర్వ్‌లో ‘టార్క్’ సైతం
ఈ కార్యక్రమంలో దేశ విదేశాలనుంచి పాల్గొ న్న ఆహూతుల్లో టార్క్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ చత్వాల్ పాల్గొన్నారు. ప్రకాశ్ పర్వ్‌లో పాల్గొ న్న భక్తులకు ఈ కంపెనీ 20 ట్రక్కుల టార్క్ జల్ (మినరల్ వాటర్) సరఫరా చేసింది.
గుజరాత్‌లో సంపూర్ణంగా..
బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ మద్యపాన నిషేధాన్ని తెచ్చారు. తొలిదశనుంచీ అక్కడ విజయవంతంగా అమలవుతోంది’ అని ప్రశంసించారు. గురు గోవింద్ సింగ్, మహాత్మా గాంధీ ప్రేరణతోనే బిహార్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని చేపట్టిందని నితీశ్ తెలిపారు. తూర్పు చంపారన్ జిల్లాలో బ్రిటీషర్లు చేపట్టిన నీలి మందు మొక్కల పెంపకానికి వ్యతిరేకంగా మహాత్ముడు చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. ‘నా 70 ఏళ్ల ప్రజాజీవితం లో చాలా సమాగమాలు (సిక్కుల ఉత్సవాలు) చూశాను. కానీ నితీశ్ కుమార్ ప్రత్యేక ఆసక్తితో చేపట్టిన ఈ కార్యక్రమం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నేను కూడా ఇంత గొప్పగా ఎప్పుడూ నిర్వహించలేదనిపిస్తోంది’ అని నితీశ్‌ను పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రశంసించారు.