
'అసలేం జరిగిందో చెప్పండి'
తిరువనంతపురం: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ దాడి జరిగిందని ధ్వజమెత్తారు. గురువారం ఆయన బహిరంగలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలి. పఠాన్ కోట్ లో అసలేం జరిగిందో ప్రజలకు చెప్పాలి' అని ఆంటోనీ డిమాండ్ చేశారు. మోదీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత పఠాన్ కోట్ లో దాడి జరిగిందని, ఇది తీవ్రమైన వ్యవహారమన్నారు. ఇక ఎంతమాత్రం మోదీ మౌనంగా ఉండడానికి వీల్లేదని, అసలేం జరిగిందో జాతికి చెప్పాలని డిమాండ్ చేశారు.
పంబాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను సైనిక బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులతో పోరాటంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.