
సమస్యలు కమిటీకి చెప్పుకోమన్నారు: చిరంజీవి
సాక్షి, న్యూఢిల్లీ: విభజన విషయంలో సమస్యలేవైనా ఉంటే ఆంటోనీ కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పుకోవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారని కేంద్రమంత్రి చిరంజీవి చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారన్నారు. ‘ఒక ప్రాంతానికి న్యాయం చేసి మరో ప్రాంతానికి అన్యాయం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు అంతా సమానమే. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం. సమస్యలేవైనా ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవచ్చు..’ అన్నారని తెలిపారు.
ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సెటిలర్ల భవిష్యత్, వారి నమ్మకం, మూలాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయని, ఈ దృష్ట్యా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించాలని తాను కోరానన్నారు. యూటీ చేస్తే 80 శాతం వరకు ప్రజల ఉద్వేగాలు, కోపాలు శాంతిస్తాయని చెప్పానన్నారు. యూటీగా చేయని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయడంపై అందరినీ పిలిచి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. చిరంజీవి శుక్రవారం సోనియాతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు. సుమారు అరగంట సేపు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనల తీవ్రతను, రాష్ట్రంలో స్తంభించిన పాలనను పార్టీ అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లా. పార్టీ నిర్ణయం ప్రజలను షాక్‌కు గురి చేసిందని చెప్పా.
సోనియా స్పందిస్తూ.. ఇది ఒక్క కాంగ్రెస్ నిర్ణయమే కాదని, అంద రినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వివిధ గ్రూపులతో కూర్చొని వారి అభ్యంతరాలు ఏమిటో విని వాటిపై చర్చించాలని, వాటిని తిరిగి తమకు చెప్పాలని సూచించారు. విభజనపై కాంగ్రెస్ వెనక్కి వెళుతుందా? లేదా? అనేది నేను చెప్పలేను. కానీ ఆంటోనీ కమిటీ తన సంప్రదింపులు పూర్తి చేసేవరకు మాత్రం విభజన ప్రక్రియ ముందుకు వెళుతుందని భావించడం లేదు’ అని చిరంజీవి చెప్పారు. సీమాంధ్ర ప్రజలు తీవ్రమైన కోపాగ్నితో ఉన్నారని, వారి కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని అన్నారు. లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ బాధాకరమని పేర్కొన్నారు.