సీఎం భ్రమల్లో ముంచారు: చిరంజీవి
‘ఆఖరు బంతి’ ఆశలు రేపి తేలిపోయారు: చిరంజీవి
మేమున్న ప్రభుత్వంలో ఇలా జరగడం దురదృష్టం: పల్లంరాజు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరగదంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతి దశలో ఆశలు రేపి చివరికి చేతులెత్తేశారని కేంద్ర మంత్రి చిరంజీవి మండిపడ్డారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామాలు చేయకపోవడాన్ని సమర్థించుకున్నారు. మంగళవారం ఢిల్లీలో మరో కేంద్ర మంత్రి పల్లంరాజుతో కలసి చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ‘‘విభజన జరగదని, ఆఖరు బంతి వరకు ఆడతానని సీఎం సీమాంధ్ర ప్రజల్లో ఆశలు రేపారు.
విభజన ప్రక్రియ ప్రతి దశలోనూ ఇవే భ్రమలు కల్పించారు. కానీ చివరకు తేలిపోయారు’’ అని విమర్శించారు. సీఎం రాజీనామా విషయంపై తానేమీ మాట్లాడలేనన్నారు. విభజన నిర్ణయంపై తాము అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకున్నా... సీమాంధ్రులకు న్యాయం చేయాలని, హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ చేయాలని కోరినా పట్టించుకోకుండా బిల్లును ఆమోదింపజేశారని చెప్పారు. బిల్లులో చేర్చాల్సిన సవరణలపై రాజ్యసభలో పోరాడతామని చిరంజీవి చెప్పారు. ఈ అంశంలో కాంగ్రెస్‌నే దోషిగా చూడలేమని... టీడీపీ, బీజేపీ లేఖల వల్లే యూపీఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
విషాదకరమైన రోజు: పల్లంరాజు
పార్లమెంట్ విధానానికి విరుద్ధంగా బిల్లు తేవడం దురదృష్టకరమని పల్లంరాజు వ్యాఖ్యానించారు. ‘‘ఇది మాకు విషాదకరమైన రోజు. మేం మంత్రులుగా ఉన్న ప్రభుత్వమే ఇలా చేయడం దురదృష్టకరం. కాంగ్రెస్, బీజేపీ కలసి బిల్లు ఆమోదించాలని నిర్ణయించుకున్నప్పుడు నిరసనలు తెలిపినా ప్రయోజనం ఉండద’’ని పేర్కొన్నారు.