నిందితుల ఊహాచిత్రాలు ఇవే..
మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం చేసిన ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్యకేసులో నిందితుల ఊహాచిత్రాలను గురువారం సీబీఐ అధికారులు విడుదలచేశారు.
పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా రూపొందించిన ఇద్దరు యువకుల ఊహాచిత్రాలను మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. ఈ పోలికలో ఉన్న వ్యక్తులపై తమకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు.
2013 ఆగస్టు 21న పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా డాక్టర్ నరేంద్ర దబోల్కర్పై ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు.స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దబోల్కర్ ససూన్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే దబోల్కర్ మరణించారని వైద్యులు వెల్లడించారు.
ఆ ఘటనపై కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దబోల్కర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. నిందితుల ఊహాచిత్రాల విడుదలతో కేసులో పురోగతి సాధించామని, హత్యకు పాల్పడి కూడా సంఘంలో స్వేచ్ఛగా తిరుగుతోన్న హంతకులను తర్వరలోనే పట్టుకుంటామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.