సంక్షేమ పథకాల స్థానంలో నగదు బదిలీ?
► కేంద్రం పరిశీలనలో కొత్త పథకం
► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ
నెలనెలా ఆదాయం అందించే యోచన
► యూబీఐ పేరిట బడ్జెట్‌లో ప్రకటన చేసే
అవకాశం ఉందంటూ ఊహాగానాలు
► ఇదే నిజమైతే ప్రస్తుత ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయా..
లేక ప్రజలపై అదనపు పన్నుల మోతా?
► అమలు తీరుపై ఎన్నో సందేహాలు
న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో సామాన్యులు, పేదలకు చుక్కలు చూపెట్టిన కేంద్ర సర్కారు.. వారిని తన వైపునకు తిప్పుకునేందుకు సరికొత్త పథకానికి వ్యూహ రచన చేస్తోందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు కనీస నగదు చొప్పున అందించనుందా? వచ్చేనెల పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం–యూబీఐ) పథకం పేరిట ప్రకటన చేసే అవకాశాలున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.
జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబుతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చేసిన ప్రకటనలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ కనీస ఆదాయం అందించాలనేది తన ఆలోచనని, ఇందుకు సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ నెల 11న రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మనసులో మాట బయట పెట్టారు. ప్రజలకు నేరుగా ప్రయోజనాలను నగదు రూపంలో బదిలీ చేయాలనుకుంటున్నానని, ఇది అక్రమాలను అరికట్టడంతోపాటు, ప్రయోజనాల బదిలీ వ్యయాన్ని కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి తెలివిగా వ్యవహరించారు. ‘‘ప్రస్తుతానికి మేమే సొంతంగా దీన్ని అమలు చేయడం సాధ్యం కాదు. దీనికి ఆమోదం మాత్రమే కాదు.. కేంద్ర సర్కారు సాయం కూడా అవసరం’’ అని ద్రాబు అన్నారు.
యూబీఐని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని 2017 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించే విషయమై ఏమైనా సమాచారం ఉందా? అంటూ విలేకరులు ద్రాబును ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘యూబీఐ అద్భుతమైన ఆలోచన’ అని గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కొనియాడారు. ప్రజల ఉపాధితో సంబంధం లేకుండా వారికి ప్రతీ నెలా కనీస ఆదాయం అందించే ఆలోచన కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన ధ్రువీకరించారు కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే జనవరి చివర్లో కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించే ఆర్థిక సర్వే వరకు ఆగాల్సిందేనని తెలిపారు. దీంతో త్వరలో వెలువడే ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని పేర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా కేంద్రం సామాజిక భద్రతకు సంబంధించిన ఈ పథకాన్ని ఆచరణలోకి తీసుకుంటే అత్యంత ప్రభావిత సంస్థాగత సంస్కరణ అవుతుందంటున్నారు.
యూబీఐతో మార్పు?
యూబీఐ మన దేశంలో ఎంతో మార్పును తీసుకొచ్చే పథకం అవుతుందన్నది కొంత మంది నిపుణుల అభిప్రాయం. ఇతరుల నుంచి పేదలను వేరు చేయాల్సి ఉందని వారు సూచిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో దారిద్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న వారి జాబితాలో ఎంతో మంది పేదలకు చోటు లేదని, ఆ జాబితాలో పేరున్న కొన్ని కుటుంబాల వారు లంచాలతో చోటు సంపాదించుకుంటున్నారని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో గౌరవ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రణబ్ బర్ధన్ అన్నారు. ఆధార్ కార్డు కూడా ఇందుకు ఉపకరించదని, ఎందుకంటే ఎవరు పేద, ఎవరు ధనిక అన్నది ఆధార్ కార్డుతో తెలుసుకోవడం కష్టమన్నది ఆయన అభిప్రాయం. అదే యూబీఐకి మళ్లడం ద్వారా బీపీఎల్ పేరుతో జరుగుతున్న అవినీతికి చెక్‌పెట్టవచ్చని ఆయన అభిప్రాయం. ఇక 30 శాతం ప్రజలు పేదరికంతో ఉన్న మన దేశంలో యూబీఐతో ఫలితాలు ఉంటాయన్నది మరికొందరు నిపుణుల కూడా పేర్కొంటున్నారు.
పాశ్చాత్య దేశాలకు కొత్తకాదు
సార్వతిక్ర కనీస ఆదాయం పథకానికి మూలం యూరోప్. ఇక్కడ ప్రజలకు వారి ఉపాధితో సంబంధం లేకుండా ప్రతీ పౌరుడికి నెల నెలా ఇంత చొప్పున ఇచ్చే విధానం ఉంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో అమల్లో ఉన్న యూబీఐ ప్రకారం ప్రజల ఆర్థిక, ఉపాధి స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి నగదు ప్రయోజనాలను అందించడం. ఇందులో ఎలాంటి షరతులు ఉండవు. ఈ ఏడాది జనవరి 1న ఫిన్లాండ్ ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని మొదలు పెట్టింది. 2,000 మంది ఉద్యోగులకు ప్రతీ నెలా ఒక్కొక్కరికి 560 యూరోలు (సుమారు రూ.40వేలు) అందించాలని నిర్ణయించింది. ఉద్యోగం సంపాదించినా ఈ ప్రయోజనాలను కొనసాగిస్తుంది.
అసమానత్వం పెరిగిపోవడం వల్లే..
పాశ్చాత్య దేశాల్లో కనీస ఆదాయం ఆలోచన వెనుక అసమానత్వం పెరిగిపోవడమే ప్రధాన అంశంగా ఉంది. పారిశ్రామిక యుగంలో ఉపాధి అవకాశాలు మాత్రమే పేదలకు భరోసా ఇవ్వవన్న ఓ వాదన ఉంది. ఆర్థిక సంక్షోభ సమయాల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడితే బాధితులుగా మారేది కార్మికులేనని, వారికి కనీస ఆదాయ పథకాలు ఆదుకుంటాయన్నది కొందరి అభిప్రాయం. మరో వాదన ప్రకారం యూబీఐని అమలు చేయడం సులభం. ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ప్రయోజనాలు అందించడం అన్నది చాలా శ్రమతో కూడుకున్న పని. సరైన లబ్ధిదారులను గుర్తించడం, వారికి ప్రయోజనాలను సరిగా అందేలా చూడడం, లీకేజీలు జరగకుండా చూడడం అన్నది అంత సులవు కాదన్నది నిపుణులు పేర్కొంటున్నారు. యూబీఐ వంటివి పేదల సంక్షేమం విషయంలో అవినీతికి చెక్ పెట్టడానికి వీలవుతుందని పాశ్చాత్య దేశాల నిపుణల సూచనలు. పైగా పేదలకు ఆర్థిక స్వాతంత్యాన్ని ఇచ్చినట్టు కూడా అవుతుందంటున్నారు.
ఎన్నో సందేహాలు..?
కేంద్రం యూబీఐని తీసుకొస్తే దాని అమలు ఎలా...? అన్నదే ఇప్పుడు కీలకం. ప్రస్తుతం అమల్లో ఉన్న అనేక రకాల సామాజిక భద్రతా పథకాల స్థానంలో యూబీఐని తీసుకు వస్తుందా...? ప్రస్తుత సబ్సిడీలకు చరమగీతం పాడుతుందా..? అన్న సందేహాలున్నాయి. ప్రస్తుతం కేంద్రం బడ్జెట్‌లో 4 శాతం కంటే ఎక్కువ నిధులను సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నది. యూబీఐని తలకెత్తుకుంటే జీడీపీలో ఇది 11 శాతంగా ఉంటుందంటున్నారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం యూబీఐ అనేది ప్రస్తుత సామాజిక భద్రతా పథకాల నుంచి తప్పుకోవడమే. వివిధ రూపాల్లో అందిస్తున్న సబ్సిడీలను నిలిపివేసి వారికి నగదును అందించడం. ఆ నగదుతో పేదలే నేరుగా ఆయా సేవలను అందుకోగలుగుతారు. వంటగ్యాస్ విషయంలో ప్రస్తుతం కేంద్రం చేస్తున్నది ఇదే. నేరుగా సబ్సిడీ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా దుర్వినియోగం గణనీయంగా తగ్గిన విషయం గమనార్హం. ఇక యూబీఐ వంటి పథకాలు ప్రజల్లో కష్టపడే తత్వాన్ని నీరుగారుస్తాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వ్యవస్థలో నగదు సరఫరా పెరిగి అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని, బడ్జెట్‌పై భారం భారీగా పెరిగిపోతుంద్న ఆందోళనలు సైతం ఉన్నాయి.
అంత సులువు కాదు..?
30 శాతం మంది పేదలు, మానవాభివృద్ధి సూచీలో 130 ర్యాంకులో ఉన్న మన దేశానికి యూబీఐ ఎంత వరకు తగినది?, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన ఆరోగ్యం, విద్యపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్న సందేహాలు ఉన్నాయి. అలాగే, పేద, ధనిక తారతమ్యం ఎక్కువగా ఉన్న మన దేశంలో దీని నిర్వహణ అంత సులువేమీ కాదని, భారీ బడ్జెట్‌తో కూడుకున్న దీని నిర్వహణ పెద్ద సవాలేనన్నది నిపుణుల అభిప్రాయం.
అన్ని నిదులు ఎక్కడి నుంచి వస్తాయ్?
యూబీఐని అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం అని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన అంటే... రూ.32 నుంచి రూ.47 కంటే తక్కువ ఆదాయం గడిస్తున్న వారని వివిధ రకాల కమిటీలు తేల్చాయి. రూ.32 అనే అనుకున్నా... నెలకు రూ.960 రూపాయలు అయినా యూబీఐ కింద అందించాలి. అంటే ఏడాదికి రూ.11,520. దేశంలో అందరికీ కాకుండా పేదలకే అని తేల్చినా 37.5 కోట్ల మందికి కనీస ఆదాయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఏడాదికి రూ.4.32 లక్షల కోట్ల భారం పడుతుంది. ఈ నిధులు సమకూర్చుకోవాలంటే కేంద్రం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి ప్రస్తుత సబ్సిడీలన్నింటినీ తగ్గించుకోవడం. లేదంటే ప్రజలపై అదనపు పన్నుల భారం మోపి నిధులు రాబట్టుకోవడం.