హేమంత్ సొరేన్
రాంచీ: జార్ఖండ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది.
రూ. 85 వేల కోట్ల రుణభారం:
జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్‌దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్‌దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆ పేరు తప్పిస్తారా?
దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్‌ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్‌గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్‌కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు.
ఆహార కొరత:
ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్‌దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు.
మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు:
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్‌దేగా, డుమ్కా, లోహర్‌దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్‌కు కత్తి మీద సామే.
మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ:
పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా?
దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
వాగ్దానాలను నిలబెట్టుకుంటారా?
'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్‌లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్‌దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment