
వడోదర: బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేసిన చిరుత వారితోపాటు ఉన్న చిన్నారిని ఎత్తుకుపోయేందుకు యత్నించింది. అయితే, గ్రామస్తులు అప్రమత్తం కావటంతో ముగ్గురికీ ప్రాణాపాయం తప్పింది. గుజరాత్‌లోని గిరిజనులు ఎక్కువగా ఉండే చోటాదేవ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. విక్రమ్ రాథ్వా, సప్న దంపతులు. తమ నాలుగు నెలల కుమారుడు ఆయుష్‌తో కలిసి శనివారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్నారు. పావిజెత్‌పూర్ పరిధిలోని రాయ్‌పూర్ గ్రామ సమీపంలో పొదల్లోంచి అకస్మాత్తుగా ప్రత్యక్షమైన చిరుత వారిపైకి దూకింది. సప్నను గాయపరిచి, శిశువును నోట కరుచుకునేందుకు యత్నించింది. అప్రమత్తమైన విక్రమ్ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు వెంటనే కర్రలతో వచ్చి చిరుత వెంటపడ్డారు. దీంతో భయపడిన చిరుత బాలుడిని వదిలేసి అడవి లోకి పారిపోయింది. గాయపడిన ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment