సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, ఆర్టికల్ 370 రద్దుపై వాదప్రతివాదనలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలు మెజారిటీలుగా ఉండటంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌లో హిందువులు మెజారిటీలుగా ఉంటే ఆర్టికల్ 370ని బీజేపీ తాకే ప్రయత్నం చేసేది కాదని చెప్పుకొచ్చారు.
ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసినప్పటి నుంచీ చిదంబరం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయవాద జులుంతో ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి వివాదమైనా పరిష్కారమైందా అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన గతంలో ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ చేపట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్ధీకరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రభుత్వానికి బాసటగా నిలవడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతలు బాహాటంగా సమర్ధించారు.
Comments
Please login to add a commentAdd a comment