‘గేలి’ ఒలింపిక్స్‌ ఆడుతున్నారు! | Chinas objection to Modis visit to Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

‘గేలి’ ఒలింపిక్స్‌ ఆడుతున్నారు!

Published Sun, Feb 10 2019 3:24 AM | Last Updated on Sun, Feb 10 2019 5:07 AM

Chinas objection to Modis visit to Arunachal Pradesh - Sakshi

అగర్తల/ఈటానగర్‌/గువాహటి/చాంగ్‌సరాయ్‌ (అస్సాం): తనను గేలి చేయడమే ప్రతిపక్షాల ప్రధాన పని అయిపోయిందని, తనను దుర్భాషలాడటానికి వారి మధ్య ఒలింపిక్స్‌ పోటీ ఏమైనా జరుగుతోందా అన్నట్లుగా పరిస్థితి ఉందని ప్రధాని మోదీ శనివారం వ్యాఖ్యానించారు. విపక్ష నాయకులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కోల్‌కతాలో లేదా ఢిల్లీలో ఫొటోలు దిగడంలోనే కాలం గడుపుతున్నారు తప్ప ఇంకేం చేయట్లేరని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో మోదీ శనివారం పర్యటించారు.

త్రిపురలో గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం చేసిందేమీ లేదనీ, తాము అధికారంలోకి వచ్చాక ఈ చిన్న రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని మోదీ అన్నారు. అస్సాం, అరుణాచల్‌లలో వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన, ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో అనేకచోట్ల నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్ల జెండాలు చేతబట్టి, నల్ల బెలూన్‌లను గాలిలోకి ఎగరేసి మోదీకి తమ వ్యతిరేకతను వారు తెలియజేశారు. 

ఆ బిల్లుతో మీకు ప్రమాదం లేదు.. 
అస్సాంలో వరుసగా రెండో రోజైన శనివారం కూడా మోదీ పర్యటన కొనసాగింది. కామ్రూప్‌ జిల్లా చంగ్సారీలో ఎయిమ్స్‌ ఏర్పాటు, బ్రహ్మపుత్ర నదిపై ఆరు వరుసల వంతెన, గ్యాస్‌ పైప్‌లైన్లు తదితర అనేక ప్రాజెక్టులకు అస్సాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఓ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బిల్లు ద్వారా అస్సాం లేదా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని ఆయన భరోసా ఇచ్చారు. అస్సాం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు అక్కడి భాష, సంస్కృతి, వనరులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేసి సిఫారసులు పంపిన తర్వాతనే వారికి (బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల్లో మతం కారణంగా పీడింపులకు గురై భారత్‌కు వచ్చి ఉంటున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) పౌరసత్వం ఇస్తాం.

మన దేశంలోకి బలవంతంగా ప్రవేశించేవారికి, ఇతర దేశాల్లో పీడింపులకు గురై శరణు కోరి ఇక్కడకు వచ్చే వారికి ఉన్న తేడాను మనమంతా అర్థం చేసుకోవాలి’ అని మోదీ అన్నారు. వారంతా పొరుగు దేశాల్లో తమపై దురాగతాల కారణంగా అక్కడి ఇళ్లు, ఆస్తులు అన్నీ వదులుకుని భరతమాత ఆశ్రయం కోరి ఇక్కడకు వచ్చారని పేర్కొన్నారు. అలాగే 36 ఏళ్ల నాటి అస్సాం ఒప్పందాన్ని అమలు చేసేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. అస్సాంను దేశానికి పెట్రోలియం, గ్యాస్‌ హబ్‌గా మారుస్తామని గత నాలుగేళ్లలో ఈ రాష్ట్రంలో రూ. 14 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

కాగా, మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు రెండో రోజు కూడా కొనసాగాయి. సచివాలయం వద్ద నగ్నంగా నిరసన తెలిపిన ఆరుగురు కేఎంఎస్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాయ్‌ అహొం యువ పరిషత్‌ రాష్ట్రంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఈ బంద్‌కు కేఎంఎస్‌ఎస్‌తోపాటు మరో 70కి పైగా ఇతర సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. గౌహతి విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఏజేవైసీసీ సభ్యులు నల్ల జెండాలను మోదీకి చూపిస్తూ నిరసన తెలియజేశారు. అనేక జిల్లాల్లో మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు నల్ల బెలూన్లను ఎగరేసి ఆందోళనకారులు మోదీకి తమ నిరసన తెలియజేశారు. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ మోదీ పర్యటన 
మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ పర్యటించి రూ. 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. చైనా సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌లో రహదారులు, రైల్వే, వాయు మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలతో అనుసంధానతను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రాన్ని కూడా గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అరుణాచల్‌ రాష్ట్రం సరిహద్దుల వద్ద రక్షణగా ఉంది కాబట్టి ఇది దేశానికి ముఖద్వారమనీ, మనకు గర్వకారణమని మోదీ అన్నారు.

మోదీ పర్యటనపై చైనా గుస్సా
మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్‌ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. దీనిపై గతంలోనే అనేకసార్లు చర్చలు జరిగినా విషయం కొలిక్కి రాలేదు. తాజాగా మోదీ పర్యటనపై మీడియా చైనా స్పందన కోరగా, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడారు. ‘చైనా–భారత్‌ సరిహద్దులపై చైనా స్పష్టమైన వైఖరితో ఉంది. అరుణాచల్‌ను భారత్‌లో భాగంగా చైనా ఎప్పుడూ గుర్తించలేదు.

మోదీ పర్యటనను మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. చైనా ప్రయోజనాలు, ఆందోళనలను భారత్‌ గుర్తించాలి. ద్వైపాక్షిక సంబంధాల్లో వస్తున్న పురోగతిని ఆహ్వానించాలి. దీనిని చెడగొట్టే పనుల జోలికి భారత్‌ వెళ్లకూడదు’ అని అన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ దేశం నుంచి అరుణాచల్‌ను ఎవరూ విడదీయలేరని పేర్కొంది. ఈ అంశంపై భారత్‌ కూడా స్పష్టమైన వైఖరితోనే ఉండటంతోపాటు ఈ విషయాన్ని ఇప్పటికే చైనాకు ఎన్నోసార్లు తెలియజేశామంది. ‘అరుణాచల్‌లో భారతీయ నాయకులు ఎప్పుడూ పర్యటిస్తూనే ఉంటారు. అది భారత్‌లో అంతర్భాగమే’ అంటూ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement