సీపీఎంలో భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ: మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ అగ్రనాయకత్వం మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా బెంగాల్ పార్టీ నాయకత్వంపై మాజీలు, అనుభవజ్ఞులైన సీపీఎం నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధమే నడిచింది. ఒక దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది.
ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో శని , ఆదివారం సమావేశాల్లో బెంగాల్ పార్టీ నేత, సూర్జ్యకాంత మిశ్రాపై బెంగాల్ ఓటమికి బాధ్యుడిగా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఓటమి, కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు అంశాలపై నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యంగా బెంగాల్ లో ఘోరమైన ఓటిమికి నేతలు మిశ్రా, బోస్ బాధ్యత వహించాలంటూ త్రిపుర, కేరళ, అసోం ప్రతినిధులు పట్టుబట్టడంతో రగడ మొదలైంది. పార్టీకి తీర్మానానికి వ్యతిరేకంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడంపై ప్రశ్నించాయి. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్టీ రాష్ట్ర కమిటీకి విరద్ధంగా వ్యవహరించిన బెంగాల్ బ్రిగేడ్ పై మండిపడ్డాయి. బీజీపీ, కాంగ్రెస్ ఇరుపార్టీలు పార్టీకి సమాన శత్రవులని వాదించాయి. ఇది కింది కేడర్ లో తప్పుడు సంకేతాలు పంపుతుందని త్రిపుర, కేరళ సభ్యులు వాదించారు.
కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకించిన వారిలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఉన్నారు. బెంగాల్ లో బిమన్ బోస్, మిశ్రా మూలంగా భారీ మూల్యాన్ని చెల్లుంచుకున్నామని వ్యాఖ్యానించారు. మిశ్రా, బోస్ వంటి నాయకులు కాంగ్రెస్తో పొత్తును జస్టిఫై చేయలేని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడమే పార్టీ ఏకైక లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలపై సీపీఎం నేత, మహిళా నేత జగమతి సంగ్వాన్ ను కేంద్ర కమిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు విభేదాలు చెలరేగుతుండగా, మరో కీలక నిర్ణయాన్ని సీపీఎం కేంద్ర కమిటీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
జగమతి సంగ్వాన్ తొలగింపు
హర్యానా సీపీఎం నేత, ఐద్వా ప్రధానకార్యదర్శి జగమతి సంగ్వాన్ బెంగాల్ కమిటీపై మండిపడ్డారు. పొలిట్ బ్యూరో బెంగాల్ కమిటీ కి వత్తాసుపలుకుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాటి కేంద్ర సమావేశాలను బాయ్ కాట్ చేసినట్టు ప్రకటించిన జగమతి మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే జగమతిని కేంద్ర కమిటీ నుంచి తొలగించినట్టు ప్రకటించడం విశేషం.