
ట్రాఫిక్ జామ్ అంటే.. అదో పద్మవ్యూహం.. ప్రత్యక్ష నరకం.. టైమ్‌ని మింగేసే భూతం.. నిరాశా, నిస్పృహలకు కారణం..! ఇంతేనా.. ఇంకేమైనా ఉందా? చాలానే ఉందంటోంది బోస్టన్ కన్సల్టింగ్ ఏజెన్సీ(బీసీఏ). ప్రభుత్వ ఖజానాలకు లక్షల కోట్లలో చిల్లు పెట్టే మహమ్మారి ఇదీ అంటారు వీళ్లు. అవును.
ట్రాఫిక్ జామ్‌లతో ప్రభుత్వాలకేంటి చిక్కు? అయితే గియితే మన జేబులకు పడాలిగానీ అనుకుంటున్నారా? దానికీ ఒక లెక్క ఉంది. గంటసేపు ట్రాఫిక్‌లో ఉండిపోయారనుకోండి, అంత సేపు మన వాహనాల ఇంజిన్లు ఆన్‌లోనే ఉంటాయి. దీంతో ఇంధనం వృథా.. ఆ సమయమంతా పనీపాటా ఉండదు కాబట్టి ఉత్పాదకత నష్టం. వాహనాల రద్దీలోనే మగ్గిపోయి పనిగంటల నష్టం.. కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్యం.. చికిత్సకయ్యే ఖర్చులు అదనం.
ట్రాఫిక్ నరకం నుంచి బయటపడటానికి సందు దొరికితే చాలు దూరిపోతూ వెళ్లడం వల్ల జరిగే ప్రమాదాలతో వచ్చే ఆర్థిక నష్టం.. ఇలా ట్రాఫిక్ రద్దీ వల్ల కలిగే అన్ని రకాల నష్టాలను అంచనా వేసిన బీసీఏ.. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలలో అత్యధికంగా నష్టం జరుగుతోందని వెల్లడించింది. ఈ నాలుగు నగరాల వల్ల ప్రభుత్వాలపై ఏటా రూ.1.44 లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతోందని తేల్చింది.
ఒకటిన్నర రెట్లు అదనపు ట్రాఫిక్!
మిగిలిన ఆసియా దేశాలతో పోల్చి చూస్తే మన నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా 149 శాతం అధిక రద్దీతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్, మనీలా వంటి చోట్ల పీక్ అవర్స్‌లో 88.5 శాతం రద్దీ ఉంటే.. కోల్‌కతాలో 171 శాతం, బెంగళూరులో 162 శాతం రద్దీ ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతోంది. నగరాల్లో నివాసం ఉంటున్న భారతీయులు సగటున ప్రతీ రోజూ సాధారణంగా ట్రాఫిక్‌లో ఉండే సమయం కంటే గంటన్నర సేపు ఎక్కువగా మగ్గిపోతున్నారు. ఏడాది ఏడాదికీ వాహనాలు వెళ్లే స్పీడ్ తగ్గిపోతోంది.
8 రెట్లు పెరిగిన రవాణా డిమాండ్
1980 తర్వత భారత్‌లో జనాభా బాగా పెరిగింది. ఇక రవాణా డిమాండ్ దాదాపు 8 రెట్లు పెరిగింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా సాధనాలను అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో ప్రజలు సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు.
అందులోనూ మధ్య తరగతి కూడా కార్లు మెయింటైన్ చేస్తూ ఉండటంతో ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా పెరిగింది. వచ్చే ఐదేళ్లలో 87 శాతం మంది కొత్త కార్లను కొనడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటే ఇక భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయమేస్తోంది. దీనికి పలు పరిష్కార మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.
పరిష్కార మార్గాలివీ..
♦ ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలపడాలి(బస్సులు, మెట్రోల వంటివి)
♦ నగరాల్లో కార్ పూలింగ్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలి
♦ తక్కువ దూరాలకు సైకిల్, టూ వీలర్‌లో వెళ్లాలనే అవగాహన పెరగాలి
♦ ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లు, కూడళ్లలో సిగ్నల్ లైట్స్ కోసం నిరీక్షించే సమయం తగ్గించేలా యూ టర్న్‌లు
♦ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం
♦ పార్కింగ్ సదుపాయాల కల్పన
ఏ నగరాల్లో ఎంత? (ఏడాదికి రూ.కోట్లలో)
ఢిల్లీ 63,000
బెంగళూరు 38,000
ముంబై 31,000
కోల్‌కతా 12,000
సగటు ట్రాఫిక్ స్పీడ్ (గంటకు కి.మీలలో)
నగరం 2016 2017
బెంగళూరు 20.4 17.2
హైదరాబాద్ 27.1 18.5
చెన్నై 19.6 18.9
కోల్‌కతా 20.2 19.2
ముంబై 21.6 20.7
ఢిల్లీ 26.5 25