
సాక్షి, బెంగళూరు: బీదర్‌లో ఆదివారం జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాన్ని తాను బహిష్కరిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. బీదర్-కల్బుర్గి మధ్య ఏర్పాటు చేసిన నూతన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానాన్ని ఆలస్యంగా అందజేశారని సీఎం తెలిపారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ప్రారంభోత్సవానికి కేవలం రెండు రోజుల ముందుగా నాకు ఆహ్వానాన్ని పంపారు. కార్యక్రమం గురించి ముందుగా మాతో చర్చించ లేదు. ఇది సరికాదు. బీదర్-కల్బుర్గి రైల్వే మార్గానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించింది. పథకానికి 50 శాతం మేరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇంతకుముందే నా షెడ్యూల్ ఖరారైనందున ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను. నాకు బదులుగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే పాల్గొంటారు’ అని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.
ముందు యడ్యూరప్ప రాజీనామా చేయాలి
డీఎస్పీ ఎం.కె.గణపతి ఆత్మహత్య కేసులో మంత్రి జార్జ్‌ను రాజీనామా చేయాలంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పే ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలని సీఎం సిద్ధరామయ్య అన్నారు. సుమారు ఏడాది కిందట కొడగులో డీఎస్పీ గణపతి లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి హోంమంత్రి జార్జ్, ఇద్దరు ఐపీఎస్‌లపై గణపతి అంతకుముందు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ జార్జ్, ఇద్దరు ఐపీఎస్‌లపై తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీంతో జార్జ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ పట్టుబడుతోంది. యడ్యూరప్పపై చీటింగ్, ఫోర్జరీ, డీనోటిఫికేషన్, అవినీతి వంటి అనేక క్రిమినల్ కేసులున్నాయి, ఇన్ని క్రిమినల్ కేసులున్న యడ్యూరప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముందు రాజీనా చేయాలని అని సీఎం డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment