కబేళాల మూతతో ఎన్ని కష్టాలో! | cm yogi adityanath decision creates lot of issues in up | Sakshi
Sakshi News home page

కబేళాల మూతతో ఎన్ని కష్టాలో!

Published Fri, Mar 24 2017 5:00 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

కబేళాల మూతతో ఎన్ని కష్టాలో!

కబేళాల మూతతో ఎన్ని కష్టాలో!

యూపీలో యోగి సర్కారు నిర్ణయంతో ఆందోళన
దేశంలో పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో యూపీయే టాప్
ప్రభుత్వ ఆదేశాలతో 80% కబేళాలు, దుకాణాల మూసివేత
మాంసం ఎగుమతులు, చర్మ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం
రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్న వైనం
పాల ఉత్పత్తీ తగ్గిపోవచ్చు.. గోవుల సంఖ్య ఇంకా తరిగిపోవచ్చు!
రాష్ట్రమంతటా మాంసానికి కటకట.. మూతపడుతున్న రెస్టారెంట్లు


(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కేబాళాల మూసివేత నిర్ణయంతో ఆ రాష్ట్రంలో బీఫ్ కొరత ఏర్పడింది. మాంసాహారులు తీవ్ర కటకట ఎదుర్కొంటున్నారు. అయితే.. కబేళాల మూసివేత నిర్ణయం రాష్ట్రంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా.. పాల ఉత్పత్తిలో, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న యూపీ.. ఈ నిర్ణయం వల్ల ఆ ఉత్పత్తుల్లో వెనుకబడిపోతుందని, అది ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ‘అనధికారిక కబేళాలను, యంత్రాలతో నడిచే కబేళాలను మూసివేసేందుకు కఠిన చర్యలు చేపడతా’మని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవెంటనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎన్నికల హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. మంగళవారం లక్నోలోని కమాల్గదాహా ప్రాంతంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఒక కబేళాను అధికారులు సీల్‌ చేశారు. బుధవారం మీరట్‌లో బీఎస్‌పీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన మూడు బీఫ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను సీల్‌ చేశారు.

వారణాసిలో కూడా ఒక కబేళాపై అధికారులు దాడి చేసి సీల్‌ చేశారు. ఘజియాబాద్‌లో మరో 10 మాంసం దుకాణాలను మూసివేశారు. ఇంకోవైపు మంగళవారం నాడు హాత్రాస్‌లో మూడు మాంసం దుకాణాలను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ పరిణామాలతో బుధ, గురు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మాంసం దుకాణాలు మూతపడ్డాయి. మాంసాహార ప్రియులకు మాంసం కరువైంది. ముఖ్యంగా బీఫ్‌ ధర తక్కువగా ఉండడం వల్ల ఆ మాంసం వినియోగించే వారు రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మంది మాంసం లేనిదే ముద్ద తనని వారు ఉన్నారు. ఇప్పుడు బీఫ్‌ కొరతతో ఏం చేయాలన్నది అటువంటి వారికి పాలుపోవడం లేదు.

పాల ఉత్పత్తి తగ్గుతుందా..?
దేశంలో పాల ఉత్పత్తిలో ప్రస్తుతం యూపీదే అగ్రస్థానం. 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలో 26,387 వేల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. ఒకవైపు అక్రమ కబేళాల నిషేధం, మరోవైపు గోవధకు వ్యతిరేకంగా ఉధృత చర్యలు రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పలువురు నిపుణులు చెప్తున్నారు. ముసలివైపోయిన పశువుల ధర తగ్గిపోవడం, వాటిని కబేళాలకు పంపించడం కష్టమవడం వంటి పరిస్థితుల్లో రైతులు పశువుల పెంపకం మీద, పాడి పరిశ్రమ మీద ఆసక్తి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

మాంసం ఎగుమతి పడిపోతుంది..!
దేశపు మొత్తం మాంసం ఎగుమతుల విలువ రూ. 26,682 కోట్లు కాగా.. అందులో సింహ భాగం వాటా యూపీదే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో యూపీ మాంసం ఎగుమతులు రూ. 11,351 కోట్ల మేర ఉన్నాయి. దేశవ్యాప్తంగా 62 కబేళాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందులో 38 ఒక్క యూపీలోనే ఉన్నాయి. వాటిలోనూ 37 కబేళాలు విదేశాలకు ఎగుమతి చేసే బీఫ్ (పశు మాంసం) ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ కబేళాలు నిబంధనలు పాటించడం లేదని, లైసెన్సులు లేవని మూతవేయడం వల్ల మాంసం ఎగుమతులు అకస్మాత్తుగా పడిపోయి రాష్ట్రంలో భారీగా ఆదాయం నష్టపోతుందని నిపుణులు చెప్తున్నారు.

వేలాది మంది ఉపాధికి గండి..
కబేళాల నిషేధం, మూసివేత కారణంగా వాటిలో పనిచేసే వేలాది మంది నిరుద్యోగులుగా మారతారు. మాంసం దుకాణాలు మూతపడుతుండటంతో వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కరువవుతుంది. ఇక కబేళాల నుంచి వచ్చే పశు చర్మాలపై ఆధారపడి ఉన్న రాష్ట్రంలోని చర్మ పరిశ్రమ సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. అందులోనూ వేలాది మంది ఉపాధికోల్పోవటమే కాదు.. చర్మ ఉత్పత్తుల ఎగుమతులూ పడిపోతాయని పరిశీలకులు చెప్తున్నారు.

యూపీలో గోవులు అంతరిస్తాయా..?
ప్రభుత్వ నిర్ణయాల వల్ల యూపీలో గోవులు త్వరలోనే ‘అంతరించిపోయే’ ప్రమాదం ముంచుకురావచ్చుననీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆవుల యాజమాన్యాన్ని వదులుకుంటున్నారని, నిజానికి గోప్రాంతం (కౌ బెల్ట్)గా పేరుపడ్డ యూపీలో ఇప్పటికే ప్రతి వంద గేదెలకూ 0.64 అవులు మాత్రమే ఉన్నాయని వారు లెక్క చెప్తున్నారు. అదే పశ్చిమబెంగాల్లో వంద గేదెలకు 27 ఆవులు, అస్సాంలో 16, కేరళలో 13 అవుల చొప్పున ఉన్నాయని.. ఆ రాష్ట్రాల్లో గోవధ మీద నిషేధం లేదు కనుక వాటి సంఖ్య పెరుగుతోందని, యూపీలో గోవధను నిషేధిస్తే ఆవుల సంఖ్య ఇంకా పడిపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. అక్రమ కబేళాలను నిషేధించడం కాకుండా వాటిని క్రమబద్ధీకరించడం, నిబంధనలు పాటించేలా చూడటం వంటి చర్యలతో ఇటువంటి నష్టాలు రాకుండూ చూడవచ్చునని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వందేళ్ల ఘన చరిత్ర.. ఒక్క రోజులో మూత!
టుండే కబాబీ... యూపీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్‌ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు వంద రకాల సుగంధద్రవ్యాలతో తయారు చేసే కబాబ్‌లు, మాంసపు వంటకాల అభిమానులు ప్రపంచమంతటా విస్తరించివున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ టుండే కబాబీ కేంద్రం కూడా బుధవారం ఒక్క రోజులో మూతపడింది. బీఫ్ వంటకాలకు ప్రఖ్యాతి గాంచిన టుండే కబాబి అక్బరి గేట్‌ కేంద్రాన్ని మూసివేశారు. మటన్‌, చికెన్‌ వంటకాలను విక్రయించే అమీనాబాద్‌ కేంద్రాన్ని మాత్రం గురువారం తెరిచారు. 1905 సంవత్సరంలో లక్నో నగరంలో టుండే కబాబి కేంద్రాన్ని హాజీ మురాద్‌ అలీ స్థాపించారు. ఈ సంస్థకు చెందిన నాలుగు కబేళాలను 2013-15 సంవత్సరాల మధ్య అధికారులు మూసివేశారు. తాజాగా లక్నోలో కబేళాల మూసివేతతో బీఫ్‌ కొరత ఏర్పడటంతో టుండే కబాబీ కేంద్రాన్ని మూసివేశారు. ‘మాంసం దొరకకపోతే ఎలా నడుపుతాం. బీఫ్‌ కబాబీ దుకాణాన్ని రెండు రోజులుగా పూర్తిగా మూసివేశాం’ అని యజమాని మొహమ్మద్‌ ఉస్మాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement