
'బార్' వివాదంపై స్పందించిన స్వాతి సింగ్
లక్నో: తాను చేసిన ఒకే ఒక్క పనితో ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతి సింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. 'బీ ద బీర్' అనే పేరుగల లగ్జరీ బార్‌ను ప్రారంభించడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న యూపీలో సాక్షాత్తు మంత్రులే మద్యానికి ప్రచారం కల్పించడంతో దేశ వ్యాప్తంగా మంత్రి స్వాతి పేరు మార్మోగిపోయింది. ఈ వివాదంపై మహిళా మంత్రి స్పందించారు. 'బార్ ఓపెనింగ్ వివాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నన్ను వివరణ అడిగిన మాట వాస్తవమే. అయితే వివరణ ఇచ్చుకునేందుకు నా వద్ద ఏ సమాచారం లేదు. ఇంతకంటే నేను మీకు ఏం చెప్పలేనని' పేర్కొన్నారు.
ఓ వైపు బీఫ్ నిషేధమంటూ.. మరోవైపు బీర్‌ను పొంగిస్తూ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని యూపీ బీజేపీపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాను సీఎం అయ్యాక యూపీలో అల్లరిమూకల ఆట కట్టించేందుకు యాంటీ రోమియో బృందాలను ఏర్పాటు చేయడం, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని వదిలిపెట్టడం మీకే మంచిదంటూ హెచ్చరిస్తూ పాలన కొనసాగిస్తున్న ఆదిత్యనాథ్ మహిళా మంత్రి స్వాతి సింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం యోగి వద్ద ఆమె ఏం సమాధానం ఇచ్చారో తెలియదు.. కానీ ఆమె ఇచ్చిన వివరణపై యోగి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతిని అభ్యంతరకంగా దూషించి, బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్సెండ్ అయిన దయాశంకర్ సింగ్ సతీమణే ఈ స్వాతి సింగ్. యోగి కేబినెట్‌లోని మహిళా మంత్రుల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆమె ప్రస్తుత తీరుపై కాషాయదళాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.