నిజాయితీపరుల్ని కాపాడాలి | Coalgate: IAS, IPS, IFoS bodies rally behind former Coal Secretary PC Parakh | Sakshi
Sakshi News home page

నిజాయితీపరుల్ని కాపాడాలి

Published Sat, Oct 19 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

Coalgate: IAS, IPS, IFoS bodies rally behind former Coal Secretary PC Parakh

పరేఖ్‌కు బాసటగా నిలిచిన బ్యూరోక్రాట్లు
కేసులతో నిజాయితీ పరుల్లో నిరుత్సాహం: ఐఏఎస్ సంఘం
కేసులు రుజువు కాకపోతే నష్టపరిహారమివ్వాలి: ఐపీఎస్ సంఘం

 న్యూఢిల్లీ: బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌కు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్ సంఘాలు బాసటగా నిలిచాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ పరేఖ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల అధికారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించిన అధికారులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి.
 
 పరేఖ్ కేసుపై చర్చించడానికి ఐఏఎస్ అధికారుల సంఘం శనివారం సమావేశం కానుంది. పదవిలో ఉండగా, పదవీ విరమణ అనంతరం ఎదురవుతున్న వేధింపులపై తీసుకోవాల్సిన చర్యలపై  ఆ సంఘం చర్చించనుంది. ‘అవినీతిపరుల్ని ఉరితీయండి. కానీ నిజాయితీ పరుల్ని కాపాడాలి’ అని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి సంజయ్ భూస్ రెడ్డి వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణం కేసులో పరేఖ్ పేరు చేర్చడం వల్ల నిజాయితీగా పనిచేసే అధికారుల్లో నిరుత్సాహం నిండిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసులను ఎదుర్కొన్న సందర్భాల్లో ఆ కేసులు రుజువు కాకపోతే ఆ అధికారికి నష్టపరిహారం చెల్లించే అంశంపై ఆలోచించాలని ఐపీఎస్ సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం కార్యదర్శి, సీఆర్‌పీఎఫ్ ఐజీ పంకజ్ సింగ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారన్నారు. తాము నిజాయితీ పరులైన అధికారులకు, వారు సర్వీసులో ఉన్నా రిటైరైనా మద్దతిస్తామని ఐఎఫ్‌వోఎస్ సంఘం అధ్యక్షుడు ఏఆర్ చద్దా చెప్పారు. పరేఖ్ చాలా సామరస్యంగా మెలిగే అధికారని తెలిపారు.
 
 పరేఖ్ కారణాలు చెప్పలేదు: సీబీఐ
 ఒకసారి తిరస్కరించిన తర్వాత మళ్లీ హిందాల్కోకు బొగ్గు క్షేత్రాలు ఎందుకు కేటాయించారో మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ వివరించలేకపోయారని సీబీఐ ఆరోపించింది. తాము కేసు ఫైల్ చేసేముందు పరేఖ్‌ను విచారించిన సందర్భంలో బొగ్గు క్షేత్రాల్ని హిందాల్కోకు అప్పగించడానికి దారి తీసిన పరిస్థితులు వివరించలేకపోయారని, అందుకే ఆయన్ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సి వచ్చిందని సీబీఐ వర్గాలు వివరించాయి. తమ విచారణలో ఏవిధమైన అక్రమాలు బయటపడకపోతే కేసును మూసివేస్తామని, ఆ విషయం సుప్రీం కోర్టు ద్వారా వెల్లడి అవుతుందని సీబీఐ వర్గాలు చెప్పాయి. కాగా, సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కుమార మంగళం బిర్లాను వెనకేసుకు రావడం పట్ల వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మపై సీపీఎం మండిపడింది. కేసుపై ప్రభావం చూపడానికి మంత్రి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ పొలిట్‌బ్యూర్ ఒక ప్రకటనలో విమర్శించింది. కేసును నిష్పాక్షికంగా విచారణ చేయాలని సీబీఐని కోరింది. బిర్లా కేసుపై ఆయిల్ మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. భారతదేశం ఔరంగజేబు పరిపాలనలో లేదని, న్యాయసూత్రాల ఆధారంగా పరిపాలన జరుగుతోందని చెప్పారు. గట్టి ఆధారాలు లేకుండా కేసులు పెట్టబోరని తెలిపారు. భారత్ మరో రష్యా కాకుండా విచారణ సంస్థలు చూడాలన్నారు. పరేఖ్ వ్యాఖ్యల ఆధారంగా ప్రధానిపై కూడా విచారణ చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పునరుద్ఘాటించారు.
 
హిందాల్కో తప్పు చేయలేదు: కుమార మంగళం బిర్లా
సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత హిందాల్కో చైర్మన్ కుమార మంగళం బిర్లా తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. ఆర్థిక మంత్రి చిదంబరం, రెవిన్యూ కార్యదర్శి సుమిత్ బోస్‌తో శుక్రవారం సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఆదిత్య బిర్లా గ్రూపు దాఖలు చేసిన బ్యాంకు లెసైన్స్ అప్లికేషన్‌పై సీబీఐ కేసు ప్రభావం పడుతుందా అన్న పశ్నకు.. ‘ప్రస్తుతానికి నేనేమీ ఆందోళన చెందడం లేదు. ఏమీ తప్పు చేయనపుడు ఎందుకు ఆందోళన చెందాలి?’ అని ప్రశ్నించారు. ఇతర విషయాలతో పాటు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌పై కూడా మంత్రితో తాను చర్చించానని, పనులన్నీ జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. మరోపక్క జాతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కూడా బిర్లా కేసుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఏవిధమైన చర్యలైనా తీసుకునేముందు భయాందోళనలు పెచ్చరిల్లకుండా అమితమైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సీబీఐకి చెప్పింది. అయితే బిర్లా పేరు ప్రస్తావించకుండా సీఐఐ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అధికారం సీబీఐకి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement