
ఆప్ ఎంపీ వీడియోపై కమిటీ
9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన స్పీకర్
- నిర్ణయం తీసుకునేవరకు సభకు హాజరుకావద్దని మన్‌కు ఆదేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రాంగణాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారంపై ఆప్ ఎంపీ భగవంత్ మన్ క్షమాపణలను పరిగణనలోకి తీసుకోని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్.. ఆ అంశంపై విచారణ జరిపేందుకు సోమవారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ సభ్యడు కిరిట్ సోమయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ 9 మంది సభ్యుల కమిటీని ఆగస్ట్ 3లోగా నివేదిక సమర్పించాలని మహాజన్ ఆదేశించారు. నివేదిక అందిన తరువాత, పార్లమెంటు భద్రతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నిర్ణయం తీసుకునేవరకు సభాకార్యక్రమాలకు హాజరు కావద్దని మన్‌ను ఆదేశించారు.
కమిటీ ముందు తన వాదన ఈనెల 28లోగా వినిపించాలనిఅవకాశమిచ్చారు. మన్ వీడియోతో పార్లమెంటు ప్రాంగణంలో తలెత్తనున్న భద్రతాపరమైన సమస్యలు, తదనంతర పరిణామాలను కమిటీ విచారిస్తుంది. విచారణ కమిటీలో మీనాక్షి లేఖి(బీజేపీ), సత్యపాల్ సింగ్(బీజేపీ), ఆనంద్‌రావు అద్సుల్(శివసేన), బీ మెహతాబ్(బీజేడీ), రత్నాడే(టీఎంసీ), కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్), పీ వేణుగోపాల్(అన్నాడీఎంకే), తోట నరసింహం(టీడీపీ)లకు చోటు కల్పించారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తనివ్వకుండా చేసేందుకు తనపై బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్‌లు కలసికట్టుగా కుట్రపన్నాయని మన్ ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కమిటీ ముందు వివరణ ఇచ్చి, సభకు హాజరయ్యేందుకు అనుమతిస్తే బావుండేదన్నారు. సభకు హాజరుకావడం ఎంపీగా తన హక్కని వ్యాఖ్యానించారు.
జైరాం, రేణుకలపై హక్కుల తీర్మానం
కాంగ్రెస్ సభ్యులు జైరామ్ రమేశ్, రేణుకా చౌదరిలు తమ పార్టీ లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌తో సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ శిరోమణి అకాలీ దళ్(ఎస్‌ఏడీ) రాజ్యసభలో సభా హక్కుల తీర్మానం తీసుకొచ్చింది. వారిద్దరు సభ బయటా కౌర్‌తో అలాగే ప్రవర్తించారని ఆరోపించింది. దీనికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీర్మానాన్ని ఎదుర్కోవాలని డిమాండ్ చేసింది. గత శుక్రవారం రాజ్యసభ వాయిదా పడ్డాక రమేశ్, రేణుకలకు కౌర్‌కు మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఎస్‌ఏడీ సభ్యుడు సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా లేవనెత్తారు. మంత్రికి ఏ సభలోనైనా మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. అకాలీ ఆరోపణలను రమేశ్, రేణుక తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు కోరుతూ వచ్చిన బిల్లును అధికాపక్షం అడ్డుకోవడానికి గొడవ చేసిందని ఆరోపించారు.
ఐఐటీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: తిరుపతి సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోన్న ఆరు కొత్త ఐఐటీలకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. సాంకేతిక విద్యాసంస్థల(సవరణ) బిల్లు-2016 కింద తిరుపతి, జమ్మూ, పాలక్కడ్, గోవా, ధార్వాడ్, భిలాయ్‌ల్లో కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నారు. ధన్‌బాద్‌లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌నూఈ బిల్లులో చేర్చారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభలో మాట్లాడుతూ ‘అందరికీ విద్య, మంచి విద్య’ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నెట్‌కు అర్హత మార్కులు 50 శాతమే!
అధ్యాపక ఉద్యోగార్థులకు జరిపే జాతీయ అర్హత పరీక్ష(నెట్) రాయాలనుకునే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు పీజీలో కనీసం 50% మార్కులు ఉండాలని మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే లోక్‌సభకు చెప్పారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్ రాయడానికి పీజీలో కనీసం 55 % మార్కులు రావాల్సి ఉండగా, 2016లో సవరించిన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 5 % సడలింపునిచ్చారన్నారు.