
ఎవరి వాదన వారిదే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే వద్ద మరోమారు ఇరు ప్రాంత నేతలు ఎవరి వాదనలు వారు వినిపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు షిండేను గట్టిగా కోరగా, సీమాంధ్ర అభ్యంతరాలను పరిశీలిస్తున్న ఆంటోనీ కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు ప్రక్రియపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్రమంత్రులు విన్నవించారు. ప్రక్రియ నెమ్మదించడంతో తెలంగాణ ప్రాంతంలో లేని అపోహలు కలుగుతున్నాయని, ఈ దృష్ట్యా వీలైనంత త్వరగా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మాత్రం కమిటీ నివేదించే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేబినెట్ నోట్‌పై ఓ నిర్ణయానికి రావాలని కోరారు. షిండే మాత్రం ఇరు ప్రాంత నేతల్లో ఎవరికీ ఏ హామీ ఇవ్వలేదు. కాకపోతే నోట్ ఇప్పటికే తయారైందనే సంకేతం మాత్రం ఇచ్చారు. అయితే నోట్‌లో ఏముందో తాను చూడలేదని, దానిపై తానింకా సంతకం కూడా చేయలేదని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం.
హైదరాబాద్‌పై మూడు రకాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయంటూ వస్తున్న వార్తలను తెలంగాణ నేతల వద్ద షిండే తోసిపుచ్చినట్టు కూడా తెలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని షిండే చెప్పినట్టు తెలంగాణ నేతలు తెలిపారు. షిండేతో మొదట తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడి 55 రోజులు గడుస్తున్నా ప్రక్రియపై కేంద్రం స్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంతో తెలంగాణలో ఆందోళనలు నెలకొన్నాయని, అపోహలు కలుగుతున్నాయని దామోదర, జానా చెప్పారు.
ఇక ఆలస్యం చేయకుండా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించారు. ‘దానిపై మూడు ప్రతిపాదనలు హోంశాఖ ముందున్నాయంటూ భిన్న వార్తలు వస్తున్నాయి. కానీ సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణే ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఏది చేసినా తెలంగాణకు నష్టమే’ అని వివరించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా హైదరాబాద్ రెవెన్యూ పరిధికే పరిమితం చేయాలని కోరారు. మూడు ప్రతిపాదనలు మీడియా సృష్టేనని షిండే చెప్పారు. ‘అలాంటి ప్రతిపాదనలేవీ మా ముందు లేవు. అసలు కేబినెట్ నోట్‌ను నేనింకా చూడలేదు. దానిపై సంతకమూ చేయలేదు’ అని అన్నట్టు సమాచారం. తెలంగాణ నోట్‌ను వీలైనంత త్వరగా కేబినెట్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తామని కూడా అన్నారని చెబుతున్నారు. విభజన తర్వాత శాసనమండలి రద్దవుతుందన్న వార్తలను కొందరు ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. యూపీ, బీహార్‌ల్లో విభజన తర్వాత కూడా మండలిని కొనసాగించారని, రాష్ట్రంలోనూ అలాగే చేయాలని కోరారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం జిల్లా నేతలు కోరారు. అనంతరం కొందరు తెలంగాణ నేతలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిశారు.
తారసపడ్డ కిరణ్, తెలంగాణ నేతలు: షిండేతో భేటీ ముగించుకుని తెలంగాణ నేతలు బయటకు వస్తున్న తరుణంలో కిరణ్, మంత్రులు బాలరాజు, పితాని సత్యనారాయణ హోం శాఖ కార్యాలయంలోకి వెళ్లారు. డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి మినహా మరెవరూ కిరణ్‌ను పలకరించలేదు. సీమాంధ్రలో సమైక్యోద్యమం ఉధృతంగా ఉన్నందున విభజనపై ఎలాంటి ముందడుగేసినా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని షిండేకు కిరణ్ వివరించారు. కాబట్టి ప్రక్రియను మరికొంత కాలం ఆపాలని, కనీసం ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకానైనా ముందుకు పోరాదని కోరినట్టు తెలిసింది. హైదరాబాద్‌పైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. అన్ని హంగులతో అభివృద్ధి చెందిన హైదరాబద్‌ను వదులుకునేందుకు సీమాంధ్రులు ఏమాత్రం సిద్ధంగా లేరని కిరణ్ చెప్పారంటున్నారు. భేటీకి ముందు సీమాంధ్ర ఎంపీలు, బొత్స ఏపీభవన్‌లో కిరణ్‌తో చర్చించారు. ‘రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రయోజనముండదు. విభజనపై కేంద్రం వెనక్కు తగ్గదని స్పష్టంగా తెలుస్తున్న తరుణంలో రాజీనామాలెందుకు?’ అని కిరణ్ అన్నట్టు తెలిసింది.
భేటీ సమయంలోనే బయటకు వచ్చిన సీబీఐ డెరైక్టర్: షిండేతో కిరణ్ భేటీ అయిన కాసేపటికే సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా హోంశాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చారు. పలు కేసుల విషయమై హోం శాఖ కార్యదర్శి గోస్వామితో ఆయన భేటీ అయ్యారని తెలిసింది.
కిరణ్‌కు దొరకని సోనియా అపాయింట్‌మెంట్: కిరణ్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించలేదు. ఎన్‌ఐసీ సమావేశంలో, రాజస్థాన్ ఎన్నికల ప్రచారం తదితరాలతో ఆమె తీరిక లేకుండా ఉండటమే కారణమని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. సోనియాను కలవకుండానే మంగళవారం సాయంత్రం కిరణ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు.