సీఎం అభ్యర్థిగా ప్రియాంకను దింపుతున్నారా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహమే రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తర్జనభర్జనలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లేదా, ప్రియాంకా గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోరుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తానికి తన గత నిర్ణయాలకు భిన్నంగా ప్రతి వ్యూహాన్ని రచించనుంది.
ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. అయితే, దీనిపై పార్టీ తరుపున మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. అయితే, రాహుల్ గాంధీనిగానీ, ప్రియాంకను గానీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించనట్లయితేనే బ్రాహ్మణ కులానికి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతు తెలుపుతామాని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం చెబుతోంది.
అయితే, సాధారణంగానే ఉత్తరప్రదేశ్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ రాహుల్, ప్రియాంకలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేనే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ నెల 19న అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్ఛేరిల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి అనంతరం కాంగ్రెస్ పార్టీ తన తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి గాంధీ కుటుంబం నుంచి వస్తారా లేక బ్రాహ్మణ అభ్యర్థినే ప్రకటిస్తారా అనే విషయం తేలనుంది.