
వాద్రా వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. వాద్రా ప్రజాజీవితంలో లేరని, ఆయన ఎలాంటి హోదాలోనూ లేరని కాంగ్రెస్ పేర్కొంది. ప్రైవేట్ కార్యక్రమాల వద్ద వాద్రాను పదేపదే ప్రశ్నించడం సరికాదని వ్యాఖ్యానించింది. మీడియా ఇలాంటి వైఖరి విడనాడాలని సూచించింది.
రాబర్ట్ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో భూమి లావాదేవీలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన వాద్రా మైకును తోసేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా మీడియా ప్రతినిధుల పట్ల కఠినంగా ప్రవర్తించింది. విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని వాద్రా తన సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ స్పందించింది.