
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విధ్వంసానికి లక్షల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుదల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 40 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 239కు చేరింది. ఇక దేశంలో శనివారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7447కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 643 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1574 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 13 మంది మృత్యువాత పడగా.. 92 కొత్త కేసులు నమోదయినట్లు ఆరాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. (మాటపై నిలబడ్డా.. ఇక మీ వంతు: గంభీర్ )
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 487కు చేరుకుంది. కరోనాతో 12 మంది మరణించగా.. 45 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 381 కరోనా కేసులు నమోదవ్వగా ఆరుగురు మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు(శనివారం) ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దేశంలో అమలవుతున్న 21రోజుల లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా.. లేదా కొనసాగించాలా అన్న అంశంపై, కరోనాపై అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. (కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment