ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తున్నాడు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గోవాలో బీజేపీ ముందుకెళ్లనుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేరుగా చెప్పకుండా ఉండాలని అనుకుంటోంది. అయితే, ప్రస్తుతం రక్షణశాఖ నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గోవాకు కాబోయే ముఖ్యమంత్రి అని మరో కేంద్ర మంత్రి, బీజేపీలో కీలక నేత నితిన్ గడ్కరీ పరోక్షంగా చెప్పారు.
'ఢిల్లీలో ఉన్న ఒక నేత గోవా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలే వారి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు. అయితే, వారిలో ఒకరినే ముఖ్యమంత్రిగా చేయాలనేం లేదు.. ఢిల్లీ నుంచి మేం ముఖ్యమంత్రి అభ్యర్థిని పంపిస్తాం' అని గడ్కరీ ఓ పత్రికా సమావేశంలో చెప్పారు. పారికర్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకు కేంద్రం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా చర్చిస్తున్నారంట.