ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,190 కి పెరిగింది. వారిలో ఇప్పటివరకు 98 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్కరోజే తమిళనాడులో 17 పాజిటివ్ కేసులు నమెదయ్యాయి. తాజాగా పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఈ మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 32కి చేరింది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా మహారాష్ర్ట 6, గుజరాత్ లో 6 నమోదు కాగా, కర్ణాటక 3, మధ్యప్రదేశ్ 2, ఢిల్లీ 2, పశ్చిమ బెంగాల్ 2, జమ్మూకశ్మీర్ 2 మృత్యువాత పడ్డారు. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు. (ఒకవేళ నేను మరణిస్తే..: డాక్టర్)
మహారాష్ట్ర, కేరళలో ఎక్కువ
దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా మహారాష్ట్రలో 215 నమోదు కాగా.. కేరళలో 202 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటిరకు 83 కేసులు, తెలంగాణలో 70, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 72 కేసులు, గుజరాత్‌లో 69, రాజస్తాన్‌లో 60 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదవ్వడంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరింది. (కరోనా వార్డులో సేవలందిస్తోన్న నటి)
ఆ రాష్ట్రాల్లో ఒకే ఒక్క కరోనా పాజిటివ్
ఇక పంజాబ్ కరోనా బాధితుల సంఖ్య 39 నమోదవ్వగా, హర్యానా 35, జమ్మూకశ్మీర్ 41, మధ్యప్రదేశ్ 47, ఆంధ్రప్రదేశ్ 21, పశ్చిమ బెంగాల్ 21, లడఖ్ 13, బీహార్15, అండమాన్ నికోబార్ దీవుల్లో 10 కేసులు నమోదయ్యాయి. చంఢీగర్ 8, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్‌లలో ఏడు కేసులు నమోదయ్యాయి. గోవా 5, హిమాచల్‌ప్రదేశ్ 3, ఒడిశా 3, పాండుచ్చెరి, మిజోరం, మణిపూర్‌లలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.
లాక్‌డౌన్‌ను పొడిగించే ఉద్దేశం లేదు: కేంద్రం
ఇక 21 రోజుల లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన లేదని సోమవారం కేంద్ర కాబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబా స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ కారణంగా, వేలాదిమంది వలస కార్మికులు నిరాశ్రయులయ్యారు. వారంతా తమ స్వస్థలాలకు పయనమవ్వగా, సరిహద్దులో వారిని ఆపేస్తున్న సంగతి తెలిసిందే. వలస కార్మికులను ఆదుకొని వారికి ఆహార వసతి కల్పించాల్సిందిగా మంత్రి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉంచిన వారు నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నగరాల్లో ప్రజల కదలికల్ని గమనిస్తూ లాక్‌డౌన్‌ను విజయవంతంగా కొనసాగించాలని రాజీవ్‌గౌబా వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్ట ప్రధాన కార్యదర్శులను, డీజీపీలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment